Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ ఫోర్త్ వేవ్‌, కోవిడ్ మ‌హ‌మ్మారి కేసుల పెరుగుదల భయాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. క‌రోనాకు సంబంధించి కీల‌క విష‌యాల పై చ‌ర్చించ‌డంతో పాటు పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు స‌మాచారం.  

Coronavirus: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియజేశారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 12 గంటలకు కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రులతో చర్చిస్తానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితిపై ప్రజెంటేషన్ చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. క‌రోనా వైర‌స్ ఫోర్త్ వేవ్ భయాల మధ్య, దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనావైర‌స్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరిగిన తర్వాత, చాలా నగరాల్లో మరోసారి మాస్క్‌లు పెట్టుకోవ‌డం తప్పనిసరి చేస్తూ ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. 

Scroll to load tweet…

భారతదేశంలోని వయోజన జనాభాలో 86 శాతానికి పైగా ఇప్పుడు కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు వేయబడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. మంగళవారం నాటికి దేశంలో వ్యాక్సిన్ మోతాదుల పంపిణీ సంఖ్య 188 కోట్లు దాటింది. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు 19 లక్షలకు పైగా (19,67,717) వ్యాక్సిన్ డోస్‌లు వేయబడ్డాయి. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి కోవిడ్ వ్యాక్సిన్ ముందు జాగ్రత్త మోతాదులు 46,044 అందించారు. దీంతో ఈ వయస్సు సమూహంలో మొత్తం ముందు జాగ్రత్త మోతాదుల సంఖ్య 5,15,290కి చేరుకుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) మంగళవారం భారత్ బయోటెక్ త‌యారు చేసిన కోవాక్సిన్‌కు 6-12 సంవత్సరాల వయస్సు వారికి మరియు కార్బెవాక్స్ 5-12 సంవత్సరాల వయస్సు గల వారికి అత్యవసర వినియోగ కింద ఇవ్వ‌డానికి అనుమ‌తి మంజూరు చేసింది. జైడస్ కాడిలా రెండు డోసుల‌ కోవిడ్-19 వ్యాక్సిన్ ను కూడా 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వ‌య‌స్సు జనాభా కోసం ఆమోదించబడింది.

అంత‌కుముందు 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోడీ దేశప్రజలు క‌రోనా వైర‌స్ ప‌ట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించడం, సరైన దూరాన్ని అనుసరించడం మరియు తరచుగా చేతులు కడుక్కోవడం వంటి అన్ని నివారణ చర్యలను అనుసరించాలని కోరారు. దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న ప‌రిస్థితుల‌ను గురించి ప్ర‌స్తావించారు. కోవిడ్రా-19 టీకాలు తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను చెప్పారు. రాబోయే ఈద్, అక్షయ తృతీయ, భగవాన్ పరశురామ జయంతి మరియు వైశాఖ బుద్ధ పూర్ణిమ పండుగలను జరుపుకోనున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ఈ పండుగలన్నీ సంయమనం, స్వచ్ఛత, దాతృత్వం మరియు సామరస్యాన్ని నొక్కి చెబుతాయ‌నీ, వాటి గురించి ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. పండుగలను ఎంతో ఉల్లాసంగా, సామరస్యంతో జరుపుకోవాలని, అయితే వీటన్నింటి మధ్యలో కరోనా పట్ల కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు.