న్యూఢిల్లీ: కరోనా వ్యాధిని వ్యాప్తి చెందకుండా ఉంచేందుకు గాను రైల్వే శాఖ ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది.  గూడ్స్ రైళ్లు మినహాయించి  ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది.

మార్చి 31వ తేదీ వరకు ఈ రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.  ప్రజా రవాణాను కట్టడి చేయడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి నిర్మూలనను తగ్గించే అవకాశం ఉందని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకొంది.కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కొన్ని రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది.

Also read:తెలంగాణలో మరో కేసు: 22 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు

సుమారు 2400లకు పైగా ప్యాసింజర్ రైళ్లు, 1400ల ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిపివేశారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 4 గంటల వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఆదివారం నాడు మధ్యాహ్నం ఈ మేరకు రైళ్వ శాఖ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే ఇప్పటికే మార్గమధ్యలో ఉన్న రైళ్లు మాత్రం తమ గమ్యస్థానాలకు చేరిన తర్వాత ఆయా స్టేషన్లలోనే నిలిపివేయనున్నారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పలు సూచనలను చేసింది. మరో వైపు ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఆదివారం నాడు జనతా కర్ఫ్యూను నిర్వహిస్తున్నారు.