కరోనా వైరస్... ప్రపంచదేశాలను వణికిస్తున్న పేరు ఇది. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ప్రస్తుతం ఇతర దేశాలకు కూడా పాకేసింది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా 400మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే... ఈ వైరస్ కారణంగా ప్రస్తుతం బెంగళూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడాన్ని పోలీసులు నిలిపేశారు.

కేవలం ఈ కరోనా వైరస్ కారణంగానే.... ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిలిపేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెప్పారు. సాధారణంగా వాహనదారుల నోట్లో గొట్టం పెట్టి గాలిని ఊది ఆల్కోమీటర్ ద్వారా మద్యం తాగిందీ లేనిదీ పరిశీలిస్తారు. అయితే... ప్రస్తుతం కరోనా భయం ఉంది కాబట్టి.. ఎవరైనా ఒక్కరికి ఆ వైరస్ఉన్నా..  ఇలా చేయడం వల్ల మిగిలిన వాళ్లకు కూడా సోకే ప్రమాదం ఉంది. 

దీంతో ట్రాఫిక్‌ పోలీసు విభాగం హెడ్‌ రవికాంతేగౌడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆల్కోమీటర్‌ వాడకుండా వైద్య పరీక్షలు నిర్వహించి జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు సూచించారు.  

Also Read విజృంభిస్తున్న కరోనా వైరస్: తొలి అమెరికన్ మృతి...

ఇదిలా ఉండగా ఈ వ్యాధి వల్ల చైనాకి తోడుగా ఫిలిప్పీన్స్, హాంగ్ కాంగ్ లలో మాత్రమే మరణాలు నమోదయ్యాయి. దాదాపుగా 24 దేశాలకు ఈ కరోనా వైరస్ వ్యాపించినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక తాజాగా చైనాలో అమెరికాకు చెందిన ఒక 60 ఏళ్ళ ముసలాయన మరణించాడు. దీనితో అమెరికాకు చెందిన తొలి వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినట్టు అమెరికన్ ఎంబసీ ధృవీకరించింది. 

ఇకపోతే... కరోనా సోకినా వ్యక్తులు ఉండడం వల్ల నది సంద్రంలో ఆపేసిన జపాన్‌‌కి చెందిన క్రూయిజ్ నౌకలో మరో ముగ్గురికి కూడా తాజాగా కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. 

ఇలా నౌకలో ఈ కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 64కి చేరింది. తాజాగా వైరస్ సోకిన ముగ్గురిలో ఇద్దరు అమెరికా దేశ పౌరులేనని తేలింది. అందువల్ల ఆ నౌకలో వైరస్ సోకిన అమెరికన్ల సంఖ్య ఇప్పుడు 13కి చేరుకుంది.