Coronavirus: 2కోట్ల మంది టీనేజర్లకు పూర్తి టీకాలు.. కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?
Coronavirus: కరోనా ప్రభావం నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు కోట్ల మంది టీనేజర్లకు (15-18 ఏండ్ల వయస్సు ఉన్నవారికి) రెండు డోసుల వ్యాక్సిన్లు అందించారు. అలాగే, దేశంలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
Coronavirus: ఇప్పటికీ పలు దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. గత నెల రోజుల నుంచి భారత్ లోనూ కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసులు 20 వేల దగ్గరకు పడిపోయాయి. అయితే, థర్డ్ వేవ్ ప్రభావం అధికంగా లేకపోవడానికి ప్రధాన కారణాల్లో వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటమే నని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదిలావుండగా, కరోనా ప్రభావం నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు కోట్ల మంది టీనేజర్లకు (15-18 ఏండ్ల వయస్సు ఉన్నవారికి) రెండు డోసుల వ్యాక్సిన్లు అందించారు. 15-18 మధ్య సంవత్సరాల వయస్సు ఉన్న రెండు కోట్ల మందికి కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యువ భారతం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. టీనేజర్లు ఉత్సాహంగా కొవిడ్ టీకాలు తీసుకుంటున్నారని అన్నారు. కాగా, 15-18 సంవత్సరాల మధ్య వయుసున్న వారికి టీకాలు వేసేందుకు జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనిలో భాగంగానే రెండు కోట్ల మంది టీనేజర్లకు రెండు డోసుల టీకాలు అందించారు. అలాగే, కరోనా థర్డ్ వేను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోసులు సైతం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కరోనా (Coronavirus) నియంత్రణ కోసం కోవిడ్-19 పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్పటివరకు దేశంలో మొత్తం 175.0 కోట్ల కోవిడ్-19 టీకాలను పంపిణీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో మొదటి డోసుల సంఖ్య 90.7 కోట్లు ఉండగా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 75.1 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్పటివరకు మొత్తం 75,68,51,787 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 12,54,893 కోవిడ్-19 (Coronavirus) శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనావైరస్ ఆంక్షలు సడలిస్తున్నాయి.
ఇదిలావుండగా, దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 22,279 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 14 శాతం తగ్గింది. మొత్తంగా ఇప్పటివరకు 4,28,02,505 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, మరణాలు సైతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటల్లో దేశంలో కొత్తగా 325 మంది కోవిడ్-19 తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,11,230కి పెరిగింది. ఇదే సమయంలో కరోనా నుంచి 60298 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉంది.