Coronavirus: డెల్టా కంటే ఒమిక్రాన్ వేవ్‌లోనే అధిక కేసులు.. మరణాలు !
Coronavirus: పలు దేశాల్లో ఇప్పటికీ కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. అయితే, కరోనా వైరస్ డెల్టా వేరియంట్ విజృంభించిన సమయంలో కంటే ఒమిక్రాన్ ఉధృతి సమయంలోనే కరోనా మరణాలు, కేసులు అధికంగా నమోదయ్యాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.
Coronavirus: ఇప్పటికీ పలు దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా, భారత్, బ్రెజిల్, పల యూరప్ దేశాల్లో గత నెలన్నర రోజుల నుంచి కరోనా ప్రభావం అధికంగా ఉంది. అయితే, ప్రస్తుతం ఆయా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. కేసులు, మరణాలు తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే, కరోనా వైరస్ డెల్టా వేరియంట్ విజృంభించిన సమయంలో కంటే ఒమిక్రాన్ ఉధృతి సమయంలోనే కరోనా మరణాలు, కేసులు నమోదయ్యాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా అమెరికాలో ఒమిక్రాన్ వేరియట్ ఉప్పెన లో కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. డెల్టా కేసుల కంటే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు యూఎస్‌లో అధికంగా నమోదయ్యాయని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ యూఎస్‌లోని 14 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రభావం కొనసాగుతోంది. రెండు వారాల క్రితంతో పోలిస్తే.. ఇప్పుడు ఆ ప్రభావం రెట్టింపు అయింది. ఆ రాష్ట్రాలు అలబామా, అలస్కా, అర్కాన్సాస్, కాలిఫోర్నియా, జార్జియా, హవాయి, ఇడాహో, కెంటుకీ, మైనే, ఓక్లహోమా, టేనస్సీ, టెక్సాస్, ఉటా, వెస్ట్ వర్జీనియా లు ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించిన తర్వాత యూఎస్‌లో 30,163,600 కంటే ఎక్కువ కేసులు, 154,750కి పైగా కొత్త మరణాలు నమోదయ్యాయి. డెల్టా కాలం కంటే ఓమిక్రాన్ వేవ్ సమయంలో అధికారిక కేసుల సంఖ్య 176% ఎక్కువగా నమోదయ్యాయి.
ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 425,074,129 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 5,906,501 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం కేసుల్లో 350,781,802 మంది కోలుకున్నారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకే, రష్యా, జర్మనీ, టర్కీ, ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా, ఇరాన్ లు టాప్ లో ఉన్నాయి. గత నెల రోజుల నుంచి భారత్ పంజా విసిరిన కరోనా వైరస్ ప్రస్తుతం గణనీయంగా క్షీణించింది. కొత్త కేసులు ఏకంగా 20 వేల దిగువకు పడిపోయాయి.
భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా క్షీణించగా.. మరణాలు సైతం తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,051 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 4,28,38,524 కు పెరిగింది. ఇదే సమయంలో 37,901 (RECOVERED) మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 4,21,24,284 కి పెరిగింది. ప్రస్తుతం 2,02,131 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 206 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,12,109 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.3 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.1 శాతంగా ఉంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ లు టాప్ లో ఉన్నాయి. ఇదిలావుండగా, కరోనా ప్రభావం నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 175.5 కోట్ల కోవిడ్-19 టీకా డోసులను పంపిణీ చేశారు. అందులో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 90.7 కోట్లు ఉండగా, రెండు డోసులు అందుకున్న వారి సంఖ్య 75.3 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.