ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరో వైపు స్కూల్స్ రీ ఓపెన్ కానుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్కూల్ పిల్లలకు టీకా పంపిణీ వేగం పెంచాలని, తద్వార వారు సురక్షితంగా స్కూల్ వెళ్లడానికి ఆస్కారం కలుగుతుందని తెలిపారు. కరోనా ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు.
న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ దేశంలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నిపుణులు హెచ్చరికలు చేశారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం కూడా వార్నింగ్ ఇచ్చింది. కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మన్సుఖ్ మాండవీయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ఇంకా సమసిపోలేదని, స్కూల్ పిల్లలకు టీకా పంపిణీ వేగాన్ని పెంచాలని తెలిపారు. వయోధికులకూ బూస్టర్ షాట్లు ఇవ్వాలని, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను మరోసారి బలోపేతం చేయాలని అన్నారు.
కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు కాబట్టి, కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ తప్పకుండా అమలు చేయాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుదలను ఆయన ప్రస్తావించారు. టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని, తద్వార కేసు ఉధృతిని అంచనా వేయడానికి ఆస్కారం కలుగుతుందని, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం కుదురుతుందని అన్నారు. అదే విధంగా జీనోమ్ సీక్వెన్సింగ్ పైనా ఫోకస్ పెట్టాలని, తద్వార వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు, మ్యూటేంట్ల గురించి తెలుసుకోవచ్చని తెలిపారు.
అలాగే, టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్‌ల స్ట్రాటజీని అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా చెప్పారు. సవరించిన గైడ్‌లైన్స్‌నూ రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకుని అమలు చేయాలని, విదేశస్థుల రాకపై నిఘా పెట్టాలని, హెల్త్ ఫెసిలీటీ, ల్యాబ్స్, కమ్యూనిటీల ద్వారా సర్వెలెన్స్‌నూ చేపట్టాలని వివరించారు.
రోగనిరోధక శక్తి స్వల్పంగా ఉండే వారికి టీకాలు వేయడంపై ఫోకస్ పెట్టాలని, దీనిపై రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. అదే విధంగా 12 ఏళ్ల నుంచి 17 ఏళ్ల పిల్లలను గుర్తించి వెంటనే వారికి టీకా వేసే ప్రయత్నాలు చేపట్టాలని తెలిపారు. వారికి ఫస్ట్, సెకండ్ డోసుల టీకా వేస్తే, వారు సురక్షితంగా స్కూల్‌కు వెళ్లే వీలు ఉంటుందని వివరించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయాతో మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, హర్యానా, గుజరాత్, జార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
