దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త చెప్పారు. నివాస ప్రాంతాల్లోని దుకాణాలు తెరచుకునేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం ఆదివారం వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఈ సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో కాస్త ఊరటనిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.

Also Read:పరిమితమైన సడలింపులతో లాక్ డౌన్ కొనసాగింపుకు రాష్ట్రాల మొగ్గు

అయితే కంటోన్మెంట్ ప్రాంతాలు మినహాయించి, మిగిలిన నివాస ప్రాంతాల్లో దుకాణాలు తెరచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే లాక్‌డౌన్ నిబంధనల నుంచి సడలింపు ఇస్తున్నామని.. షాపింగ్ మాళ్లు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు మాత్రం అనుమతి లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

ఢిల్లీలో చేపట్టిన ఫ్లాస్మా థెరపీ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని, అందుచేత కరోనా బారినపడి కోలుకున్నవారు తప్పకుండా రక్తదానం చేయాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read:కరోనాపై పోరుకు ప్రజలే నాయకత్వం: మన్‌కీ బాత్ లో మోడీ

మానవత్వంతో ఇప్పటికే చాలా మంది ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనా కారణంగా 54 మంది మరణించగా, 2,652 మందికి పాజిటివ్‌గా తేలింది.