Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎంత‌మంది చ‌నిపోయారంటే..?

Covid-19: గత 24 గంటల్లో 3,377 కొత్త కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్లు నమోదవడంతో పాటు ఇదే స‌మ‌యంలో వైరస్ తో పోరాడుతూ.. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారతదేశంలో మొత్తం క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 4,30,72,176కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 
 

Coronavirus LIVE Updates: India Reports 3,377 New COVID-19 Cases In 24 Hours
Author
Hyderabad, First Published Apr 29, 2022, 1:06 PM IST

Coronavirus: చైనా, ద‌క్షిణ కొరియా, ప‌లు యూర‌ప్ దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. భార‌త్ లోనూ గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా వైర‌స్ కొత్త కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్-19 ప్ర‌భావం పెరుగుతున్న‌ద‌ని ప్ర‌స్తుతం న‌మోద‌వుతున్న కేసుల గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ స‌హా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరగడం.. కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌లను జన్యు శాస్త్రవేత్తలు వేగంగా గుర్తించ‌డం కోవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదనడానికి స్పష్టమైన సంకేతంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు జాగ్ర‌త్తలు తీసురోవ‌డం అత్యంత ముఖ్య‌మ‌ని వైద్య బృందాలు, అధికార యంత్రాంగాలు పేర్కొంటున్నాయి. 

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..గత 24 గంటల్లో దేశంలో 3,377 కొత్త క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 4,30,72,176కి పెరిగింది. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్త‌గా వైర‌స్ తో పోరాడుతూ 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భార‌త్ లో క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 5,23,753కి చేరుకుంది. దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసుల సంఖ్య 17,801కి పెరిగింది. అలాగే, కొత్త‌గా దేశంలో క‌రోనా వైర‌స్ నుంచి 2,496 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 42530622 కు పెరిగింది. రిక‌వ‌రీ రేటు 98.8 శాతంగా ఉండ‌గా, కోవిడ్‌-19 మరణాల రేటు 1.22 శాతంగా నమోదైంది.

క‌రోనా మ‌హ‌మ్మారి రోజువారీ సానుకూలత రేటు 0.71 శాతంగా ఉండ‌గా, వారంవారీ సానుకూలత రేటు 0.63 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా మ‌ళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగవంతం చేయ‌డంతో పాటు ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 188.87 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను అందించారు. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 91.4 కోట్లు ఉన్నాయి. క‌రోనా రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 81 కోట్లుగా ఉంది.  క‌రోనా ప‌రీక్ష‌ల‌ను సైతం పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి. గ‌త 24 గంటల్లో దేశంలో మొత్తం 4,73,635 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించిన‌ట్టు భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 83,69,45,383 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 

కాగా, దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కేసులు, మ‌ర‌ణాలు అధికంగ నమోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర టాప్ ఉంది. ఆ త‌ర్వాతి స్థానంలో కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లు ఉన్నాయి.  దేశంలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాలు క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నాయి. మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తీసుకువ‌చ్చాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios