న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులోనే నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. 

సోమవారం నాడు సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు.గత 24 గంటల్లో 4,213 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది. 1,559 మంది కరోనా నుండి కోలుకొన్నారని కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటివరకు ఒకే రోజున ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

దేశంలో 67,152 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 20,197 మంది కోలుకొన్నారని కేంద్రం తెలిపింది. 44.029 యాక్టివ్ కేసులుగా కేంద్రం ప్రకటించింది.దేశంలో 2,206 మంది మృతి చెందినట్టుగా కేంద్రం తెలిపింది. 

also read:కొత్తవాళ్లొస్తే కరెంట్, నీళ్లు బంద్: ఘజియాబాద్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ నిర్ణయం

వలస కార్మికుల కోసం దేశ వ్యాప్తంగా మరిన్ని రైళ్లు నడుపుతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. వలస కార్మికుల కోసం 468 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు భౌతిక దూరం పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. రేపటి నుండి నడిచే రైళ్లలో  టిక్కెట్లు కన్ ఫర్మ్ అయిన వాళ్లు రైల్వేస్టేషన్లకు వెళ్లవచ్చని ప్రభుత్వం తెలిపింది.ప్రయాణీకులు రైల్వేస్టేషన్ కు కనీసం 90 నిమిషాల ముందుగానే చేరుకోవాలని ప్రకటించింది.