దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో షట్ డౌన్ దిశగా భారతదేశం అడుగులు వేస్తోంది. కరోనాపై ఏర్పాటైన మంత్రుల బృందం మంగళవారం సమావేశమై పరిస్ధితిని సమీక్షించింది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంక్షల్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.

టర్కీ సహా ఐరోపా, బ్రిటన్ నుంచి ఏ విమానం, ఏ నౌకా ఎవరినీ అక్కడి నుంచి తీసుకురాకూడదని తేల్చి చెప్పింది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారికి మాత్రం 14 రోజుల పాటు నిర్బంద చికిత్సను అమలు చేయనున్నారు. ఈ నెల 18 నుంచి 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read:సెక్రటేరియేట్‌లో కరోనా కలకలం: ఉద్యోగులు, అధికారుల్లో భయాందోళనలు

వైరస్ వ్యాప్తి భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఉద్ధృతంగా ఉంది. ఇప్పటి వరకు ఇది 39 వరకు సోకగా, 200 మంది పరిశీలనలో ఉన్నారు. మూడు నెలల పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

రాష్ట్రంలో జరగాల్సిన ముఖ్యమైన పరీక్షలను వాయిదా వేశారు. రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుండటంతో ప్రధాని నరేంద్రమోడీ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు కరోనా కట్టడికి ప్రపంచంలో ఎక్కడా లేని అసాధారణ నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.

నూటికి నూరు శాతం హోమ్ క్వారంటైన్ చేసిన వారి చేతికి ట్యాగింగ్ చేయనుంది. ఎవరితోనూ కలవకుండా ఇళ్లలోనే ఓ గదికే పరిమితం చేసే వారి ఎడమ చేతికి ప్రభుత్వం ఓ స్టాంప్ వేస్తారు.

తద్వారా ఈ వ్యక్తి క్వారంటైన్‌లో ఉన్నాడని అందరికీ తెలిసేలా చేస్తారు. ఐసోలేషన్ వార్డుల నుంచి ఏడుగురు కరోనా అనుమానితులు పారిపోయి ప్రజల్లో కలిసిపోవడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

అటు కరోనా ఆంక్షలతో కర్ణాటకలో బంద్ వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలో 60 శాతం రవాణా స్తంభించిపోయింది. దేశంలో తొలి కరోనా మృతుడు కలబుర్గికి చెందిన వృద్ధుడి కుమార్తెకు సైతం కరోనా సోకింది. ఐటీ ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాయి.

తమిళనాడులో స్కూళ్లు, కాలేజీలు, మ్యూజియంలు, పార్క్‌లు, పబ్బులు, మైదానాలు, జిమ్‌లు, బార్‌లు ఈ నెల 31 వరకు మూసివేయనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహాల్ సందర్శనను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:కరోనా దెబ్బ: తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్ బంపర్ ఆఫర్!

దీంతో పాటు పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చే 3,691 చారిత్రక కట్టాలను కూడా మూసేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి వెల్లడించారు. కరోనా దృష్ట్యా త్వరలో వర్చువల్ కోర్టులు నిర్వహిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారిస్తామని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

కక్షిధారులు, న్యాయవాదులు, సిబ్బంది, అందరి ఆరోగ్యం దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే చేపడతామన్నారు. కాగా ఇప్పటి వరకు భారత్‌లో కరోనా కారణంగా ముగ్గురు మరణించగా, వైరస్ సోకిన వారి సంఖ్య 131కి చేరింది.