కరోనా వైరస్ మరో పది, పన్నెండు రోజుల్లో ఎండెమిక్ స్టేజ్‌కు వెళ్లుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు కేసులు గణనీయంగా పెరిగి.. ఆ తర్వాత క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని వివరించారు.
న్యూఢిల్లీ: కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త కేసులు ఏడు నెలల గరిష్టానికి పెరిగాయి. ఒక వైపు జాగ్రత్తలు చెబుతూనే.. కరోనా వైరస్ గురించి మరీ ఖంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ఇక చివరి స్టేజ్‌కు వచ్చిందని వివరిస్తున్నారు. మరో పది నుంచి పన్నెండు రోజుల్లో అది ఎండెమిక్ స్టేజ్‌కు చేరుతుందని అంటున్నారు. కానీ, అప్పటి వరకు కరోనా కేసులు మాత్రం భారీగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
మరో పది నుంచి పన్నెండు రోజుల వరకు కరోనా కేసులు గణనీయంగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత కరోనా వైరస్ ఎండెమిక్ స్టేజ్‌కు చేరుకుంటుందని, ఫలితంగా కరోనా కేసులు కూడా చాలా మటుకు తగ్గిపోతాయని వివరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా.. హాస్పిటల్‌లో చేరికలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. మరణాలు కూడా గతంలో పోల్చిన వాటికంటే స్వల్పంగానే ఉన్నాయి.
ప్యాండమిక్ అంటే.. ఒక వైరస్ ప్రబలంగా వ్యాప్తి చెందడం.. అది ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా.. విస్తారంగా వ్యాప్తి చెందుతూ పోవడం. దేశాలు దాటి పోయే దశను ప్యాండమిక్ అని అంటాం. అదే తీరులో ఎండెమిక్ స్టేజ్ కూడా ఉంటుంది. ఈ దశలో సదరు వైరస్ వ్యాప్తి చిన్న చిన్న ప్రాంతాలకే పరిమితం అవుతుంది. ఎక్కువ పరిధిలో దాని వ్యాప్తి ఉండదు. అదే దశలో అది దీర్ఘ కాలం ఉండిపోతుంది. అధిక ప్రమాదం లేని ఒక అంటు వ్యాధిగా ఉండిపోతుంది. ఇలా మనుషుల మధ్య వ్యాప్తిస్తూ దీర్ఘకాలంగా కొనసాగుతున్న వైరస్‌లు ఇప్పటికే చాలా ఉన్నాయి. ఉదాహరణకు తట్టు, సాధారణ జలుబు, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బీ, మశూచీ వంటి వ్యాధులు ఎండెమిక్ స్టేజ్‌లో సెటిల్ అయ్యాయి. త్వరలో కరోనా వైరస్ కూడా ఎండెమిక్ స్టేజ్‌కు వెళ్లుతుందని చెబుతున్నారు.
