Coronavirus: దేశంలో 13 వేలు దాటిన కరోనా కొత్త కేసులు.. పెరిగిన మరణాలు !
Coronavirus: ఢిల్లీలో 1,797 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి గణాంకాలతో పోలిస్తే 35 శాతం పెరిగింది. ఇలా దేశంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.
Coronavirus: భారత్ లోమళ్లీ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ తన రూపు మార్చుకుంటున్న కోవిడ్-19 అత్యంత ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు రెట్టింపు వ్యాప్తి, ప్రభావం కలిగించేవిగా ఉన్నాయని పరిశోధకులు, వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కోవిడ్-19 కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతుండటం భారత్ లో కలకలం రేపుతోంది. దేశంలో కొత్తగా కరోనా మహమ్మారి కేసులు 13 వేలు దాటాయి. మరణాలు సైతం పెరిగాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కోవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ కేసులు 13 వేల మార్కును దాటాయి. కొత్తగా 13,216 కరోనా వైరస్ కేసులతో పాటు మరో 23 మంది కోవిడ్-19 పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,32,83,793కు చేరుకుంది. కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,24,840కి పెరిగింది. కరోనా వైరస్ రోజువారీ సానుకూలత రేటు 2.73 శాతానికి చేరుకుంది. కరోనావైరస్ కొత్త కేసులు అధికంగా ఢిల్లీ (1,797), ముంబై (2,255), బెంగళూరు (634), చెన్నై (286)లలో నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 4,26,90,845 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 98.6 శాతంగా ఉంది. మరణాలు రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో 85,73,95,276 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 4,84,924 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తంగా 196 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసులు తీసుకున్న వారి సంఖ్య 91.7 కోట్లుగా ఉంది. ఇక రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 83.8 కోట్లుగా ఉంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు, మరణాలు అధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానాలు ఉన్నాయి.
ఢిల్లీలో 1,797 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి గణాంకాలతో పోలిస్తే 35 శాతం పెరిగింది. ఇలా దేశంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ రోజువారీ గణాంకాలు 1,000 మార్కును దాటడం ఇది వరుసగా నాలుగో రోజు. గురువారం 1,323, బుధవారం 1,375, మంగళవారం 1,118 కేసులు నమోదయ్యాయి.