Uddhav Thackeray : కరోనా వైర‌స్ ఇంకా ముగియలేద‌నీ, ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయ‌ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే అన్నారు. ప్ర‌స్తుతం చైనాలో40 కోట్ల మంది ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నార‌న్నారు. అయితే, మ‌నం మూడు క‌రోనా వేవ్ ల‌తో పోరాడి విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. మ‌న ప్రియమైన వారిలో కొందరిని కోల్పోయామ‌ని ఆయ‌న అన్నారు. 

Maharashtra: ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. క‌రోనావైర‌స్ ను మొద‌టిసారి గుర్తించిన చైనాలో ప్ర‌స్తుతం దారుణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంతో చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇక భార‌త్ లోనూ గ‌త కొంత కాలంగా త‌గ్గుముఖం ప‌ట్టిన కోవిడ్‌-19 కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. పోర్త్ వేవ్ త్వ‌ర‌లోనే రానుంద‌ని ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. COVID-19 వ్యాప్తిని నివారించడానికి అన్ని ముందు జాగ్రత్త మార్గదర్శకాలను అనుసరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రజలను కోరారు. పెరుగుతున్న కోవిడ్-19 కేసులకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన తర్వాత థాక్రే ఈ ప్రకటన చేశారు.

"కరోనా ఇంకా ముగియలేదు, ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. చైనాలో, 40 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్నారు. మేము కూడా మూడు తరంగాలతో విజయవంతంగా పోరాడినప్పటికీ మన ప్రియమైన వారిలో కొందరిని కోల్పోయాము" అని ముఖ్య‌మంత్రి థాక్రే అన్నారు. క‌రోనా వైర‌స్ టీకా రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి బూస్టర్‌ డోస్‌ ఇస్తూ తొమ్మిది నెలల వ్యవధిని తగ్గించాలని, టీకాను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపుతామని ముఖ్యమంత్రి చెప్పారు. 
గత నెలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. కరోనా నాల్గవ వేవ్ వచ్చే అవకాశం నివేదిక‌లు అందుతున్నాయ‌ని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో ఇక‌పై లాక్‌డౌన్ విధించ‌కుండా, కొన‌సాగుతున్న ఆంక్ష‌ల‌ను నిలిపివేయాల‌నుకుంటే పౌరులు మాస్క్‌లు ధరించ‌డం, టీకాలు వేయించుకోవ‌డం, కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఉద్ధ‌వ్ థాక్రే స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. క‌రోనా వైర‌స్ పరీక్షల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ థాక్రే ఆదేశించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధ‌వారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ‌ర్చువ‌ల్ గా సమావేశ‌మ‌య్యారు. పెరుగుతున్న క‌రోనా వైర‌స్ కేసులు, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. పెరుగుతున్న కోవిడ్ -19 రోగులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్ని డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించి పరిస్థితిని సమీక్షించారు. కోవిడ్ నిరోధక నిబంధనలను పాటించడంపై ప్రతి జిల్లాలో మరియు రాష్ట్ర స్థాయిలో అవసరమైన అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే 18 నుంచి 59 ఏళ్లలోపు పౌరులకు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి బూస్టర్ డోస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కాగా, భారత్ లో ఇప్పటివరకు మొత్తం 4,30,65,496 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా మహమ్మారితో 5,23,654 మంది చనిపోయారు. దేశంలో కరోనా మరణాలు, కోవిడ్ కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ ఉంది. ఇప్పటివ‌ర‌కు మ‌హారాష్ట్రలో మొత్తం 78,77,078 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 1,47,838 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.