మ‌ళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు.. కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..?

New Delhi: కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వయోజనుల చికిత్సకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. భౌతిక దూరం, ఇండోర్ లోనూ మాస్కులు వాడకం, చేతుల పరిశుభ్రత వంటివి ప్రజలు పాటించాల‌నీ, కొన్ని పరిస్థితులలో యాంటీబయాటిక్స్ నివారించడం కీల‌క‌మ‌ని పేర్కొంది.
 

coronavirus cases on the rise in India; 918 new Covid-19 cases reported RMA

Coronavirus cases are increasing in India: దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. దీనికి తోడు వైర‌ల్ ఫ్లూలు సైతం పెరుగుతుండ‌టంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ క్ర‌మంలోనే కోవిడ్-19 కు సంబంధించి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసింది. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. 

దేశంలో గ‌త కొంతకాలంగా త‌క్కువ‌గా ఉన్న క‌రోనా వ్యాప్తి మ‌ళ్లీ పెరుగుతున్న‌ద‌ని వైద్య రిపోర్టులు పేర్కొంటున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ డేటా ప్రకారం.. భారతదేశంలో ఒకే రోజు 918 కొత్త కరోనావైరస్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో యాక్టివ్ కేసులు 6,350 కు పెరిగాయి. దేశంలో కోవిడ్ -19 మరణాల సంఖ్య 5,30,806 కు పెరిగింది. కొత్త‌గా న‌లుగురు కోవిడ్-19 తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. తాజా మ‌ర‌ణాల్లో రాజస్థాన్ లో రెండు, కర్ణాటకలో ఒకటి, కేరళలో ఒక మరణం నమోదయ్యాయి. 

సోమ‌వారం ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన డేటా ప్రకారం, రోజువారీ పాజిటివిటీ 2.08 శాతంగా ఉంది. వారంత‌పు పాజిటివిటీ 0.86 శాతంగా నమోదైంది. కాగా, క‌రోనా వైర‌స్ వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి దేశంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 4.46 కోట్ల (4,46,96,338)కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 0.01 శాతంగా ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.8 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 44,225 టెస్టులు నిర్వహించిన‌ట్టు భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 92.03 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన‌ట్టు వెల్ల‌డించింది.

అలాగే, దేశంలో క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,59,182కి చేరుకుంది. మ‌రణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు..

కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వయోజనుల చికిత్సకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం, దగ్గు 5 రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మార్గదర్శకాలపై జనవరి నెలలో చర్చించారు. తీవ్రమైన లక్షణాలు లేదా అధిక జ్వరం ఉంటే, రెమ్డెసివిర్ (మొదటి రోజు 200 మి.గ్రా ఐవి, తరువాత 4 రోజులకు 100 మి.గ్రా ఐవి ఓడి) ఇవ్వడాన్ని పరిగణించవచ్చు. వైర‌స్, బ్యాక్టీరియా సంక్రమణపై క్లినికల్ అనుమానం ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ వాడకూడదు. కొవిడ్-19 ఇతర అంటువ్యాధులతో కలిసి సంక్రమించే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల‌ని సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హైగ్రేడ్ జ్వరం/ తీవ్రమైన దగ్గు, ముఖ్యంగా 5 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios