న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఒక్క రోజులోనే 20,903 కరోనా కేసులు నమోదు కావడం దేశంలో ఇదే ప్రథమం. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 6,25,544కి చేరుకొన్నాయి. 

దేశంలో 2,27, 439 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా సోకినవారిలో 3,79,892 మంది కోలుకొన్నారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 18,213 మంది మరణించారు.  గత 24 గంటల్లో కరోనాతో 379 మంది మృత్యువాత పడ్డారు.

కరోనా సోకిన రోగుల్లో రికవరీ రేటు 60.72కి చేరుకొందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 92,97,749 మంది శాంపిల్స్ పరీక్షించారు. గురువారంనాడు ఒక్క రోజునే దేశ వ్యాప్తంగా 2.4 లక్షల మంది శాంపిల్స్ పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా 37 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 232 కేసులు రికార్డైనట్టుగా సీఎం ప్రేమ ఖండూ తెలిపారు.ఇందులో 160 యాక్టివ్ కేసులు కాగా, ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 71 మంది కోలుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

also read:దేశంలో కరోనా విజృంభణ: ఆరు లక్షలు దాటిన కేసులు, 17 వేలు దాటిన మరణాలు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 35 మందికి కరోనా సోకింది. ఇందులో 23 మంది ఐటీబీపీ జవాన్లు కూడ ఉన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,015కి చేరుకొంది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గురువారంనాడు ఒక్క రోజే 154 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 115కి చేరుకొంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7849కి చేరుకొన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

యూపీ రాష్ట్రంలో 4.77 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గోవా రాష్ట్రంలో ఒక్కరోజులోనే 95 కొత్త కేసులు నమోదు కావడం రికార్డు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1482కి చేరుకొన్నాయని కేంద్రం తెలిపింది.