న్యూఢిల్లీ: 24 గంటల్లో ఇండియాలో 18 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 5.66,840కి చేరుకొన్నాయి. వరుసగా ఆరు రోజులుగా దేశంలో 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో 2,15,125 యాక్టివ్ కేసులుగా ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. 3,34,822 మంది కరోనా నుండి కోలుకొన్నారు. గత 24 గంటల్లో 418 మంది మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా 16,893 మంది మరణించినట్టుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి.

దేశంలో ఇప్పటివరకు 86,08,654 శాంపిల్స్ పరీక్షించారు.  సోమవారం నాడు ఒక్క రోజే 2,10,292 శాంపిల్స్ పరీక్షించారు.మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కరోనా హాట్ స్పాట్స్ గా ఉన్నాయని కేంద్రం తెలిపింది.

హైద్రాబాద్ కు చెందిన ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ పేరుతో వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది. ఈ వ్యాక్సిన్ ను ఈ ఏడాది జూలైలో మనుషులపై  క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించింది.

దేశంలో కరోనా రోగుల రికవరీ 59.06గా నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో మిజోరాం రాష్ట్రంలో ఒక్క కొత్త కేసు కూడ నమోదు కాలేదు. రాష్ట్రంలో 151 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుండి 61 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో 90 యాక్టివ్ కేసలున్నాయి.

also read:భారత్ బయోటెక్ గుడ్‌న్యూస్: జూలైలో హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై మాసంలో కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఢిల్లీలోని కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటికి సర్వే జూలై 6వ తేదీ నాటికి పూర్తి కానుందని కేంద్రం తెలిపింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.

బీహార్ రాష్ట్రంలో 24 గంటల్లో 394 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9,618కి చేరుకొన్నాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది.అస్సాం రాష్ట్రంలో 302 కొత్త కేసులు నమోదయ్యాయి. 172 కేసులు గౌహాతి పట్టణంలో నమోదయ్యాయని వైద్య శాఖ తెలిపింది.