పెరుగుతున్న కోవిడ్-19 కేసులు.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష..
New Delhi: కోవిడ్ -19 కేసుల పెరుగుదలను నివేదించిన ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతవారం లేఖ రాసింది. కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాలని లేఖలో కోరింది.
PM Modi to hold high-level review meeting on Covid: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా వేయికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కేసులు అధికంగా నివేదిస్తున్న ఆరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతవారం ఒక లేఖ రాసింది. కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాలని లేఖలో కోరింది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ నివారణకు సన్నద్ధం కావడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో కరోనా నివారణకు సంబంధించిన ఏర్పాట్లను గురించి చర్చించనున్నారు.
వివరాల్లోకెళ్తే.. కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య సన్నద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేడు (బుధవారం) ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 4.30 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం అప్డేట్ చేసిన కరోనావైరస్ డేటా ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,134 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనావైరస్ క్రియాశీల కేసులు 7,026 కు పెరిగాయి.
ఇదే సమయంలో కోవిడ్-19 తో పోరాడుతూ మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,30,813కి చేరింది. చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున తాజా మరణాలు సంభవించాయని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్-19 రోజువారీ పాజిటివిటీ 1.09 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ 0.98 శాతంగా నమోదైంది. కోవిడ్ కేసుల పెరుగుదలను నివేదిస్తున్న ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం లేఖ రాసింది. కరోనావైరస్ స్థానికీకరించిన వ్యాప్తి కేసుల పెరుగుదలకు కారణమవుతుందని సూచించింది.
కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని సూచిస్తూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయనీ, సంక్రమణను నివారించడానికి, నియంత్రించడానికి రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. "సంక్రమణ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం కఠినమైన నిఘా ఉంచడం, ఆందోళన కలిగించే ఏ ప్రాంతంలోనైనా అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం" అని ప్రశాంత్ భూషణ్ అన్నారు.
— Asianetnews Telugu (@AsianetNewsTL) March 22, 2023