Coronavirus: భారత్ లో లక్షదాటిన యాక్టివ్ కేసులు.. పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
Coronavirus: భారత్ కరోనా వైరస్ యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త కేసుల కారణంగా యాక్టివ్ కేసులు లక్షదాటాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Active Covid-19 cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం పెరుగుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. భారత్ లోకూ కరోనా కొత్త కేసులు మళ్లీ అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు మాస్కుల వాడకం ప్రజల స్వేచ్ఛకు వదిలేసిన ప్రభుత్వాలు.. తప్పనిసరిగా మాస్కులు వాడాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మాస్కులు ధరించకుంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ మళ్లీ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి మరణాలు సైతం అధికం అవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,159 కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,35,47,809కి చేరుకుంది. కొత్త కేసులు అధికంగా నమోవుతుండటంతో యాక్టివ్ కేసులు లక్ష దాటాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,15,212కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇదే సమయంలో కరోనా వైరస్ తో పోరాడుతూ 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 5,25,270కి చేరుకుంది.
మొత్తం కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.26 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.53 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.56 శాతంగా నమోదైంది. వారానికి పాజిటివిటీ రేటు 3.84 శాతంగా నమోదైందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,07,327 కు పెరిగింది. మరణాలు రేటు 1.21 శాతంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు, మరణాలు అధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానాలు ఉన్నాయి.
మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 198.20 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి. ఇందులో మొదటి డోసుల సంఖ్య 91.8 కోట్లు ఉండగా, రెండు డోసుల తీసుకున్న వారి సంఖ్య 84.5 కోట్లుగా ఉంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే కోవిడ్ పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 86,44,51,219 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 451312 కోవిడ్-19 శాంపిళ్లను పరీక్షించారు.
ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టులు పేర్కొంటున్నాయి. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు టాప్ లో ఉన్నాయి.