Asianet News TeluguAsianet News Telugu

కరోనా ముప్పు ముగియలేదు.. జాగ్రత్తగా ఉండండి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ

కరోనా మహమ్మారి కథ ముగియలేదని, దానితో ముప్పు ఇంకా పొంచి ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు. కాబట్టి ప్రజలు కొవిడ్ నిబంధనలపై అలసత్వం వహించవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహజ వనరులను కాపాడేలా జీవన శైలిని రూపొందించుకోవాలని అన్నారు. పర్యావరణానికి హానీ తలపెడితేనే దాని నుంచి మానవులకు ముప్పు ఉంటుందని తెలిపారు.
 

corona not over.. be cautious say pm modi in mann ki baat
Author
New Delhi, First Published Nov 28, 2021, 12:43 PM IST

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా Corona నూతన Variant ఒమిక్రాన్(Omicron) భయాందోళనలు వెలువడుతున్న తరుణంలో ప్రధాన మంత్రి Narendra Modi దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఆయన ఈ రోజు 83 ఎడిషన్ మన్ కీ బాత్(Mann Ki Baat) కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ కరోనా మహమ్మారి ముప్పు ఇంకా ముగియలేదని అన్నారు. కాబట్టి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలోనే ఆయన మాట్లాడుతూ, తనకు అధికారం అవసరం లేదని, కేవలం ప్రజలకు సేవ చేయాలనే కోరిక తనలో దృఢంగా ఉన్నదని వివరించారు. సహజ వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సహజ వనరుల్లో సమతుల్యతను దెబ్బతిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఆయుష్మాన్ భారత్ గొప్ప పథకమని, పేదలకు ఆరోగ్య వసతులను అందుబాటులో ఉంచడమే దీని ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజనా లబ్దిదారుడితో మాట్లాడారు. తనకు అధికారం అక్కర్లేదని అన్నారు. కేవలం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పమే తనలో ఉన్నదని చెప్పారు. భారత ఆర్థిక వృద్ధి గురించీ మాట్లాడారు. ఆర్థిక వృద్ధిలో భారత దేశం ఇప్పుడు కీలక మలుపులో ఉన్నదని వివరించారు. యువత ఇప్పుడు కేవలం ఉద్యోగార్థులే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని వివరించారు. ఇప్పుడు అనేక స్టార్టప్ కంపెనీలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో మూడు రకాల యువత ఉన్నదని అన్నారు. సరికొత్త ఐడియాలు, సృజనాత్మక గలిగిన యువత ఉన్నదని, రిస్క్ తీసుకునే యువత ఉన్నదని తెలిపారు. వీరితోపాటు ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉండే యువత కూడా ఉన్నదని వివరించారు.

Also Read: Omicron: కొత్త వేరియంట్‌పై పీఎం మోడీ సమీక్ష.. ప్రధాని చెప్పిన విషయాలివే

1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత విజయాన్ని ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేశారు. పాకిస్తాన్‌పై విజయంపై 50వసంతాల కార్యక్రమాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆ యుద్ధంలో అమరులైన యోధులను గుర్తు చేసి నివాళులు అర్పించారు. మరో రెండు రోజుల్లో డిసెంబర్ వస్తున్నదని, వచ్చే నెలలో భారత్ నేవీ డే, భద్రతా బలగాల ఫ్లాగ్ డేను నిర్వహిస్తుందని వివరించారు. డిసెంబర్ 16న 1971 యుద్ధంలో గెలిచి 50 సంవత్సరాలు నిండుతుందని అన్నారు.

గత మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహజ వనరుల పరిరక్షణపై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా వాటి ప్రస్తావన చేశారు. సహజ వనరుల పవిత్రతను దెబ్బతీసినప్పుడు లేదా వాటి మధ్య సమతుల్యాన్ని దెబ్బతీసినప్పుడే వాటి నుంచి మనకు హానీ ఏర్పడుతుందని ప్రధాని అన్నారు. సహజ వనరుల పరిరక్షణకు దేశవ్యాప్తంగా పాటుపడుతున్న పలువర్గాలను ఆయన గుర్తు చేశారు. పర్యావరణంతో సంతులనం చెందుతూ, సహజ వనరులను కాపాడుతూ సాగు జీవన శైలిని ప్రజలు ఎంచుకోవడం నేడు ఎంతో అవసరమని వివరించారు.

Also Read: వంశపారంపర్య పార్టీలు ప్రజాస్వామ్యానికి చేటు: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మోడీ

కొత్త వేరియంట్ విజృంభించే ముప్పు ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు ఎత్తేయాలనే నిర్ణయాన్ని సమీక్షించాలనీ ఈ సందర్భంగా ప్రధాని మోడీ సూచనలు చేశారు. ప్రజలూ మరింత జాగ్రత్తగా మసులుకోవాలని తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహించడంపై జాగ్రత్త వహించాలని అధికారులకు తెలిపారు. ముఖ్యంగా కరోనా కేసుల రిస్క్ ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios