బోపాల్: చేతికొచ్చిన పంటలను పోలీసులు బుల్డోజర్ తో నాశనం చేయడం చూసి దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో రామ్ కుమార్ అహిర్వార్, సావిత్రి దేవీ దంపతులు కొన్నేళ్లుగా 5.5 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకొంటున్నారు. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం ఆ భూమిని ఓ కాలేజీకి కేటాయించింది.

 దీంతో ఈ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్ కుమార్ దంపతులకు సూచించారు. కానీ, వాళ్లు అంగీకరించడంతో రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవిన్యూ అధికారులు పోలీసులతో వచ్చి ఆ భూమిని ఖాళీ చేయాలని రామ్ కుమార్ దంపతులను బెదిరించారు.

ఈ భూమిలో వేసిన పంటను బుల్డోజర్ సహాయంతో నాశనం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులకు, రామ్ కుమార్ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమకు రూ. 3 లక్షల అప్పుంది, దీన్ని తీర్చేందుకు ఈ భూమిలో పంటను సాగుచేసుకొంటున్నట్టుగా దళిత దంపతులు పోలీసులకు చెప్పారు. ఇప్పటికిప్పుడే ఈ భూమి నుండి వెళ్లిపోవాలంటే తమకు చావు తప్ప వేరే దారి లేదని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రామ్ కుమార్ పై విచక్షణ రహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన ఆయన భార్య  సావిత్రిదేవీని అసభ్యంగా దూషించారు. బుల్డోజర్లతో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నించారు.

దీంతో పురుగుల మందు తాగి ఆ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దళిత దంపతులపై దాడి చేసిన పోలీసులపై జిల్లా కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది వివాదాస్పదంగా మారింది. 

ఈ విషయమై సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నింటికంటే ముందుగా పోలీసులకు క్లీన్‌చీట్‌ ఇచ్చిన కలెక్టర్‌ను, ఎస్పీని సస్పెండ్‌ చేశారు.తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.