Asianet News TeluguAsianet News Telugu

కోడల్ని అత్తింట్లోకి పంపిన బుల్ డోజర్.. విషయం ఏంటంటే...

అక్రమనిర్మాణాలను కూల్చడానికే కాదు... కాపురాలు నిలబెట్టడానికి కూడా బుల్ డోజర్లు పనికి వస్తాయని నిరూపించారు యూపీ పోలీసులు. ఓ మహిళను అత్తింట్లోకి పంపించడానికి బుల్ డోజర్లను ఉపయోగంచారు. 

cops bring bulldozer to help woman enter matrimonial house in uttarpradesh
Author
First Published Aug 30, 2022, 11:29 AM IST

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో ఓ ఘటన స్థానికంగా వినోదాన్ని కలిగించింది. చూసేవారు ఆశ్చర్యంతో.. ఆసక్తితో.. సరదాగా తీసుకోగా.. విషయం మాత్రం ఆలోచించాల్సిందే. కారణం ఏంటంటే..ఓ 30యేళ్ల మహిళను అత్తామామల ఇంట్లోకి పంపించేందుకు పోలీసులు బుల్డోజర్లతో రావడం.. మీకూ విచిత్రంగా అనిపిస్తుంది కదా.. ఇదే అక్కడి జనాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఓ వరకట్నం కేసులో తీర్పునిస్తూ.. ఆ మహిళ ఎలాగైనా అత్తగారింట్లోకి వెళ్లేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. ఆదేశాలు వచ్చి 15 రోజులు గడుస్తున్నా ఆ అత్తగారింటివారు కోడల్ని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో పోలీసులు బుల్ డోజర్లు, మైకులతో వారు ఉంటున్న వీధిలోకి వచ్చారు. మైక్ లో అనౌన్స్ మెంట్స్ చేశారు. తలుపులు తీయకపోతే బుల్ డోజర్లు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. 

ప్ర‌ముఖ ఆర్థిక వేత్త సేన్ క‌న్నుమూత‌.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంస్క‌ర‌ణ‌ల్లో కీల‌కం..

దీంతో అప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వినని అత్తింటివారు చివరికి తప్పని పరిస్తితుల్లో తలుపులు తెరిచారు. కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ క్రమమే చూసేవారికి వినోదంగా మారింది. ఆదివారం యూపీలోని బిజ్నోర్‌లోని హల్దౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్‌లో ఈ సంఘటన జరిగింది. ఎస్పీ (నగరం) ప్రవీణ్ రంజన్ మాట్లాడుతూ, "బాధిత మహిళ పేరు నూతన్ మాలిక్. ఆమెను ఇంట్లోకి ఎలాగైనా ప్రవేశించేలా చూడాలని పోలీసులకు కోర్టు ఆదేశం. ఆదివారం ఉదయం, పోలీసు బృందం ఆమె అత్తమామల ఇంటికి వెళ్లారు. లౌడ్‌స్పీకర్‌లో ఎన్నిసార్లు హెచ్చరించినా వారు తలుపు తీయలేదు. అందుకే  బుల్‌డోజర్‌ని తీసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో కొద్దిసేపటి తర్వాత వారు మహిళను ఇంట్లోకి అనుమతించారు. ఆమెకు పోలీసు భద్రత కూడా కల్పించాం" అని చెప్పుకొచ్చారు. 

నూతన్‌కి ఆమె అత్తమామలతో వరకట్నం విషయంలో గొడవ జరిగింది. తాము అడిగినంత కట్నం ఇవ్వలేదని వారు ఆమెను ఇంట్లోంచి గెంటేశారు. తిరిగి ఇంట్లోకి రానివ్వడంలేదు. దీంతో ఆమె ఈ వ్యవహారంలో న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిమీద నూతన్ తండ్రి షేర్ సింగ్ మాట్లాడుతూ, "2017లో నా కుమార్తె  వివాహం జరిగింది. మొదట్లో అంతా బాగానే ఉంది. అయితే, తగినంత కట్నం తీసుకురాలేదని భర్త,  అతని కుటుంబం ఆమెను గృహ హింసకు గురిచేశారు. మేం వారి గొంతెమ్మ కోర్కెలను నెరవేర్చలేకపోవడంతో, వారు ఆమెను ఇంటి నుండి గెంటేశారు.

దీంతో ఏమీ పాలుపోక.. ఆమె భర్త, అత్తమామలపై 2019 లో హల్దౌర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. అయినా, వారు ఆమెను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మేము అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాం. అక్కడ మాకు న్యాయం జరిగింది" అని అంటూ..  పోలీసుల చర్యపై సంతోషం వ్యక్తం చేసిన సింగ్, "పోలీసులు ఆమె అత్తమామలు తలుపు తీయకపోవడంతో బుల్‌డోజర్‌ తీసుకొచ్చి వారిపై ఒత్తిడి తేవడం సంతోషంగా ఉంది. నా కుమార్తె తన అత్తగారింట్లోనే ఉంది" అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios