ఈ కరోనా కష్టకాలంలో పోలీసులు కరోనా వైరస్ కి ప్రజలకు మధ్య అడ్డుగోడలా నిలబడటమే కాకుండా ఈ వైరస్ కష్టసమయంలో తమకు తోచిన రీతిలో, తోచిన విధంగా ప్రజలకు సహాయం కూడా చేస్తున్నారు 

తాజాగా కర్ణాటకకు చెందిన ముగ్గురు పోలీసులు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి శవానికి అంత్యక్రియలు నిర్వహించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. కుటుంబం అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాకరించిన నేపథ్యంలో దగ్గరుండి అతనికి అంతిమ సంస్కారాలు చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

వివరాల్లోకి వెళితే... చామరాజ్ నగర జిల్లా సరిహద్దుల్లో మూడు రోజుల కింద 44 సంవత్సరాల వయసున్న ఒక మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిని ఏనుగు తొక్కి చంపేసింది. 

అతడి కుటుంబం కరోనా వైరస్ సోకుతుందేమో అన్న భయంతో ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాకరించి శవాన్ని ఆసుపత్రి మార్చరీలోనే వదిలేసి వెళ్లిపోయారు. 

ఆ వ్యక్తికి తగిన రీతిలో అంత్యక్రియలు నిర్వహించి ఆత్మకు శాంతి కలిగించాలనుకున్న ఏఎస్సై మధెగౌడ మరో ఇద్దరు పోలీసులతో కలిసి అతడిని పాతి పెట్టడానికి ఒక గుంతను తవ్వించాడు. 

ఒక శ్వేతవస్త్రంలో ఆ శవాన్ని చుట్టి చామరాజ్ నగర్ లోని ఒక హిందూ స్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. అగరబత్తిలు పట్టుకొని దేవుడికి నమస్కారం చేస్తున్న అతడి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల కింద ఈ సంఘటన జరిగినట్టు చామరాజ్ నగర్ తూర్పు పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. తగిన రీతిలో అంతిమసంస్కారాలను జరిపించిన ఆ పోలీసులను అందరూ మెచ్చుకుంటున్నారు.