COP 28 : స్టేజ్‌పైకి దూసుకెళ్లిన 12 ఏళ్ల భారతీయ బాలిక...
శిలాజ ఇంధనాలను తగ్గించడం మీద COP28లో చర్చ కొనసాగుతోంది. ఈ చర్చలో దాదాపు 200 దేశాలు సమస్యను పరిష్కరించడం కోసం పాల్గొన్నాయి.
న్యూఢిల్లీ : మణిపూర్‌కు చెందిన 12 ఏళ్ల వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం ఇప్పుడు వార్తల్లోని వ్యక్తిగా నిలిచింది. మంగళవారం దుబాయ్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు 2023 (COP28) వేదికపైకి ఆమె దూసుకువచ్చింది. "శిలాజ ఇంధనాలను అంతం చేయండి. మన గ్రహాన్ని, మన భవిష్యత్తును రక్షించండి" అని రాసి ఉన్న బోర్డుని తలపై పట్టుకుని ఆమె వేదికపైకి పరిగెత్తింది.
శిలాజ ఇంధనాల వాడకాన్ని నిరసిస్తూ వేదికపైకి దూసుకొచ్చిన తర్వాత ఆమె ఒక చిన్న ప్రసంగం చేసింది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆమెను అక్కడినుంచి దూరంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. అప్పటికే ఆమె ప్రసంగానికి ముగ్థులైన ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ భారీ భూకంపం.. వణికిపోయిన తాలిబన్ పాలిత దేశం
ఆ తరువాత COP28 డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ మజిద్ అల్ సువైదీ మాట్లాడుతూ, ఆ యువతి ఉత్సాహాన్ని తాను మెచ్చుకుంటున్నానన్నారు. ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులను ఆమెకు మరో రౌండ్ చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని కోరారు.
మణిపూర్‌కు చెందిన ఈ కార్యకర్త X లో ఈవెంట్ వీడియోను పోస్ట్ చేసింది. "ఈ నిరసన తర్వాత వారు నన్ను 30 నిమిషాలకు పైగా నిర్బంధించారు. నా ఏకైక నేరం- ఈ రోజు వాతావరణ సంక్షోభానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలను తొలగించమని అడగడం. ఆ తరువాత వారు నన్ను COP28 నుండి బయటికి పంపించారు’’ అని తెలిపింది.
మరొక ఎక్స్ పోస్ట్‌లో ఆమె ఇలా రాసుకొచ్చింది.. "శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు నా బ్యాడ్జ్‌ను నిలిపివేశారు. దీనికి కారణం ఏమిటి? మీరు నిజంగా శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా నిలబడితే, మీరు నాకు మద్దతు ఇవ్వాలి. మీరు వెంటనే నా బ్యాడ్జ్‌లను విడుదల చేయాలి. ఇది ఐక్యరాజ్యసమితి ప్రాంగణంలో బాలల హక్కుల ఉల్లంఘన, దుర్వినియోగం, ఇది యూఎన్ సూత్రానికి విరుద్ధం. యూఎన్ లో నా గళాన్ని వినిపించే హక్కు నాకు ఉంది" అని పేర్కొంది. ఈ ఏడాది దుబాయ్‌లో జరిగే వాతావరణ సదస్సులో 190 దేశాల నుంచి దాదాపు 60,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.