ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ భారీ భూకంపం.. వణికిపోయిన తాలిబన్ పాలిత దేశం
ఇప్పటికే పలు భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ భూకంపం (Afghanistan earthquake) వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.2గా నమోదయ్యిందని జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం పేర్కొంది. అయితే దీని వల్ల కలిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
Afghanistan earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 7.03 గంటల సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆ తాలిబన్ పాలిత దేశం ఒక్క సారిగా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదయ్యిందని జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. భూకంపం ఉపరితలం నుంచి 120 కిలో మీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే ఈ భూకంపం వల్ల ఎంతమంది గాయపడ్డారు ? ప్రాణ, ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. భూకంపం ఉపరితలం నుంచి 120 కి.మీ.
ఈ ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ శక్తివంతమైన భూ ప్రకంపనల వల్ల వందలాది మంది మరణించారు. భవనాలు కూలిపోయాయి. తీవ్ర ఆస్తి నష్టం వాటిళ్లింది. గత కొన్ని సంవత్సరాలుగా భూకంపాలకు నిలయమైన ఈ ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ ప్రకంపనల ల్ల 2,000 మందికి పైగా మరణించారని తాలిబాన్ అడ్మినిస్ట్రేటివ్ వెల్లడించింది. ఈ ఘటనలో తొమ్మిది వేల మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.
6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం అతిపెద్ద నగరమైన హెరాత్‌కు వాయువ్యంగా 40 కిలోమీటర్లు (25 మైళ్ళు) కేంద్రంగా ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దాని తరువాత మళ్లీ మూడు బలమైన ప్రకంపనలు వచ్చాయి. వాటి తీవ్రతలు 6.3, 5.9, 5.5, గా ఉన్నాయి. తరువాత కూడా తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు వచ్చాయి. 4.3 - 6.3 తీవ్రతల మధ్య ఎనిమిది ప్రకంపనలు నమోదయ్యాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
కాగా.. అక్టోబర్ 15న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన రోజుల తర్వాత, హెరాత్ ప్రావిన్స్‌లో ఇదే తీవ్రతతో పలు ప్రకంపనలు వచ్చాయి. వీటిలో కనీసం వెయ్యి మంది మరణించారు. ఈ భూకంపాల వల్ల దేశంలోని అనేక గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.