రామ మందిరంపై బీజేపీ బాంబులు వేసి.. ముస్లింలను నిందిస్తుంది - కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. రామ మందిరంపై బీజేపీ బాంబులు వేసి, ఆ నిందను ముస్లింపై వేస్తుందని ఆయన ఆరోపించారు. దీనిపై బీజేపీ మండిపడింది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హిందూ ఓట్లను సంఘటితం చేయడానికి కాషాయ పార్టీ (బీజేపీ )రామ మందిరాన్ని పేల్చివేసే అవకాశాలు ఉన్నాయని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అయితే ఆ ఎమ్మెల్యే ఏ సమయంలో ఇలా మాట్లాడారో స్పష్టత లేదు.
‘ఇండియా టు డే’ కథనం ప్రకారం.. కర్ణాటక బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేసిన వీడియోలో.. ‘‘మోడీ తన తదుపరి లోక్ సభ ఎన్నికల్లో గెలవాలంటే, వారు (బీజేపీ) రామ మందిరాన్ని బాంబులతో పేల్చివేసి, ముస్లింలపై నిందలు వేసి హిందువులను సంఘటితం చేసే అవకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు.
కాగా.. పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ హిందూ-ముస్లిం ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోందని ఆరోపించింది. ‘‘హిందూ మత పునాదిని ప్రశ్నించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ సభ్యులు ఇప్పటికే రామమందిరంపై తమ దుష్ట కన్ను వేశారు. రామ మందిరాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించడం ద్వారా, హిందూ-ముస్లిం ఉద్రిక్తతలకు ఆజ్యం పోయడం ద్వారా కాంగ్రెస్ ఇప్పటికే ప్రభుత్వాన్ని నిందించడానికి రంగం సిద్ధం చేసింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ మంత్రి బీఆర్ పాటిల్ పొరపాటున ప్రస్తావించారు’’ అని బీజేపీ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 25 స్థానాలను గెలుచుకుంది. మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ కైవలం చేసుకోగా.. మరొకటి జేడీ(ఎస్) గెలుచుకుంది. మరో స్థానంలో ఐఎన్ డీ విజయం సాధించింది.