దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికి మూడుసార్లు లాక్ డౌన్ పొడిగించారు. మళ్లీ పొడిగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా.. ఈ లాక్ డౌన్ కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి కనీసం పరీక్షలు కూడా జరగలేదు.

అసలు మళ్లీ కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమౌతుందో కూడా ఎవరికీ తెలీదు. దీంతో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు. అయితే.. కాస్త స్థితిమంతం గల విద్యార్థులు ఆన్ లైన్ లో పాఠాలు చదువుతున్నారు. కానీ ఆర్తికంగా వెనకడిన వారి పరిస్థితి ఏంటి..?

కాగా.. అలాంటి ఇద్దరు చిన్నారులకు ఓ కానిస్టేబుల్ పాఠాలు చెప్పాడు. తాను విధులు నిర్వహిస్తూనే ఇద్దరు చిన్నారులకు పాఠాలు చెప్పడం విశేషం. ఆ విషయం తెలిసిన కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రశంసలు కురిపించాడు.

‘‘ కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తున్న ఈ సమయంలో పోలీసు సిబ్బంది అతి కీలక విధులను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చదువుకోవాలనే తపన ఉన్న ఇద్దరు చిన్నారులకు ఉత్తరాఖండ్, రుద్రపూర్ లోని కోవిడ్-19 క్వారంటైన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఈ కానిస్టేబుల్  చదువు చెబుతున్నారు. ఆయన అంకిత భావానికి నేను సెల్యూట్ చేస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.

ఆ కానిస్టేబుల్, చిన్నారుల ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. వారు మాస్క్ లను కూడా ధరించి ఉండటం గమనార్హం.