మే 4 నుంచి భారీ స్థాయిలో లాక్ డౌన్ సడలింపులు: కేంద్ర హోమ్ శాఖ ప్రకటన!
తాజాగా ఈ లాక్ డౌన్ సడలింపుల దిశగా కేంద్రం ఒక అధికారిక ప్రకటన చేసింది. నిన్న రాత్రి హోమ్ మంత్రిత్వ శాఖా అధికార ప్రతినిధి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నీ చెప్పారు.
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడడానికి ప్రపంచం వద్ద ఎటువంటి ఆయుధం లేదు. కేవలం లాక్ డౌన్ లో తల దాచుకుంటూ ఆ వైరస్ నుంచి తప్పించుకుంటోంది. భారతదేశం కూడా ప్రపంచ దేశాలు చూపిన బాటలోనే పయనిస్తూ లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ మూడు వారల లాక్ డౌన్ ముగుస్తుండగానే.... మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు స్వయానా ప్రధానమంత్రే ప్రకటించారు.
ఇక ఇప్పుడు రెండవ పర్యాయం విధించిన లాక్ డౌన్ కూడా మరో 9 రోజుల్లో ముగియనున్న విషయం అందరికి తెలిసిందే. మే 3వతేదితో ప్రధాని విధించిన లాక్ డౌన్ పూర్తవుతుంది. మే 7వ తేదీతో తెలంగాణాలో కూడా లాక్ డౌన్ ముగుస్తుంది.
ఇక ఇప్పుడు రెండవ దఫా లాక్ డౌన్ కూడా ముగింపు దశకు రావడం, ఏప్రిల్ 27వ తేదీనాడు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో సర్వత్రా కూడా ఈ లాక్ డౌన్ పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తాజాగా ఈ లాక్ డౌన్ సడలింపుల దిశగా కేంద్రం ఒక అధికారిక ప్రకటన చేసింది. నిన్న రాత్రి హోమ్ మంత్రిత్వ శాఖా అధికార ప్రతినిధి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నీ చెప్పారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల అనేక లాభాలు చేకూరాయని, వాటిని కొనసాగించడానికి మే3 వరకు లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా పాటించాలని అన్నారు.
మరొక ట్వీట్లో... మే4వ తేదీ నుండి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని, సాధ్యమైనంత మేర, మెజారిటీ జిల్లాల్లో లాక్ డౌన్ కి సంబంధించిన నిబంధనల సడలింపు ఉంటుందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెడతామని అన్నారు.
పరిస్థితులను చూస్తుంటే... గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ కి అధిక మినహాయింపులు ఇస్తూనే.... రెడ్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ ని కట్టుదిట్టంగా అమలు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలియవస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేసే చర్యల్లో భాగంగా కేంద్రం కొన్ని కొన్ని తీసుకుంటున్న విషయం తెలిసిందే!