కేరళ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు.. తండ్రి స్థానాన్ని కైవసం చేసుకున్న చాందీ ఊమెన్
కేరళ అసెంబ్లీలోని ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. మాజీ సీఎం ఊమెన్ చాందీ మరణంతో పుత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆయన కుమారుడు చాందీ ఉమెన్ విజయం సాధించారు.
కేరళలోని పుత్తుపల్లి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థి చాందీ ఊమెన్ 36,454 ఓట్ల తేడాతో సీపీఎం అభ్యర్థి జైక్ సి థామస్ పై గెలుపొందారు. దివంగత మాజీ సీఎం ఊమెన్ చాందీ కుమారుడైన ఆయనకు 78,098 ఓట్లు రాగా, సీపీఎం అభ్యర్థి జైక్ సీ థామస్ కు 41,644 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లిగిన్ లాల్ కు 6,447 ఓట్లు వచ్చాయి.
ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ జాతీయ ఔట్ రీచ్ సెల్ చైర్మన్ గా ఉన్న 37 ఏళ్ల చాందీ ఊమెన్.. తన తండ్రి ఐదు దశాబ్దాలకు పైగా అసెంబ్లీకు ప్రాతినిధ్యం వహించిన పుత్తుపల్లి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడి నుంచి తండ్రి కంటే భారీ మెజారిటీతోనే గెలుపొందారు. కాగా.. 2024 లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన ఉప ఎన్నిక లో కాంగ్రెస్ తన సంప్రదాయ కంచుకోటను నిలుపుకోవాలని పోరాడింది. అలాగే అధికార సీపీఐ (ఎం) కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకొని కొత్త పుంతలు తొక్కాలని భావించిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కేరళ రాష్ట్రానికి 2004 - 2006, 2011 - 2016 మధ్య రెండు పర్యాయాలుగా సీఎంగా పని చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఊమెన్ చాందీ మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. అందుకే దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించిన ఉప ఎన్నికలతో పాటే ఇక్కడా ఉప ఎన్నిక జరిగింది.
కాగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అలాగే బీజేపీల నుంచి అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార సీపీఐ(ఎం)కు 2024 లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వచ్చిన ఈ ఉప ఎన్నికల ఫలితాలు భారీ ఎదురుదెబ్బగా భావించవచ్చు. పుత్తుపల్లి ఉపఎన్నికలో అద్భుత విజయం మోబా, పినరయి విజయన్ ప్రభుత్వానికి స్పష్టమైన సందేశమని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితాల ‘ఇండియా టీవీ’తో అన్నారు. బీజేపీ, సీపీఎంలను పుత్తపల్లి ప్రజలు తరిమికొట్టారని తెలిపారు. కేరళలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ ఇంత భారీ మెజార్టీ రాలేదని, ఈ సందేశం చాలా క్లియర్ గా ఉందని చెప్పారు.