గుజరాత్ పాటిదార్ నాయకుడు హార్థిక్ పటేల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఒక రోజు తరువాత ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు తమ స్వప్రజయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. మరో 20 ఏళ్ల దాకా గుజరాత్ లో ఆ పార్టీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన హార్దిక్ పటేల్ గురువారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలను విమర్శించినందుకు తన పాత పార్టీ అయిన కాంగ్రెస్ పై ఆయన మండిపడ్డారు. అదానీలు, అంబానీలు కష్టపడి పని చేశారని, అందుకే వారు విజయం సాధించారని అన్నారు.
హార్థిక్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను ఇంకా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని అన్నారు. ఆ నిర్ణయాన్ని త్వరలోనే బహిరంగంగానే ప్రకటిస్తానని చెప్పారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి హార్థిక్ పటేల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నప్పుడు పార్టీలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు విదేశాలకు వెళతారని అన్నారు. పార్టీ అగ్రనేతలు ఏసీ గదుల్లో చికెన్ శాండ్‌విచ్‌లు తినేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఉగ్రవాద కేసులో దోషిగా తేలిన కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్.. 25న శిక్ష ఖరారు
రాహుల్ గాంధీకి ఎన్నిసార్లు విన్నవించినా పార్టీ బాధ్యతలు అప్పగించలేదని హార్దిక్ పటేల్ ఆరోపించారు. అభ్యర్థులకు ఎన్నికల టిక్కెట్లు ఇచ్చేటప్పుడు సలహాలు తీసుకోలేదని విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించిన తరువాత గుజరాత్‌లో ఆ పార్టీ కుల ఆధారిత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఈ సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన.. వచ్చే 20 ఏళ్ల వరకు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రాదని అన్నారు.గుజరాత్ కాంగ్రెస్ యూనిట్ నేతలు తమ స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. పాటిదార్ నాయకులకు ఆ పార్టీలో గౌరవం లేదని అన్నారు.
2015లో కోటా ఉద్యమానికి నాయకత్వం వహించి గుజరాత్‌లో సంచలనం సృష్టించిన యువ పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ ఒక్క సారిగా వెలుగులోకి వచ్చారు. అయితే ఈ ఉద్యమం సందర్భంలో ఆయన రాజకీయాల్లోకి రానని బహిరంగంగా వాగ్దానం చేశారు. కానీ అతడు 2019లో కాంగ్రెస్‌లో చేరాడు. 2020 జూలైలో రాష్ట్ర యూనిట్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడయ్యారు. అయితే కొన్ని రోజులుగా తనను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పక్కన పెట్టిందని ఇటీవల ఫిర్యాదులు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తనను సరిగా ఉపయోగించుకోవడం లేదని అన్నారు.
అవసరమైతే ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చు: జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఈ నెల ప్రారంభంంలో ఆయన తన ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను తొలగించారు. ఆ సమయంలోనే హార్థిక్ పటేల్ కాంగ్రెస్ ను వీడితున్నారని ఊహాగానాలు వచ్చాయి. కానీ వాటిపై ఆయన స్పందించలేదు. కానీ బుధవారం నాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రతీ దానిని అడ్డుకునే పార్టీగా మాత్రమే మారిపోయిందని, ప్రతీ అంశాన్ని వ్యతిరేకించే స్థాయికి దిగజారింది అని తెలిపారు. తన రాజీనామా నిర్ణయాన్ని సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం ద్వారా భవిష్యత్తులో తాను గుజరాత్ కోసం నిజంగా సానుకూలంగా పని చేయగలనని నమ్ముతున్నానని ఆ లేఖలో హార్దిక్ పటేల్ పేర్కొన్నారు.
