Asianet News TeluguAsianet News Telugu

వెన్నుపోటు పొడుస్తున్నారు: మహా వికాస్ అఘాడి సర్కార్‌పై మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు

మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో తాము భాగస్వాములైనప్పటికీ కొందరు తమకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే  సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి అనేక మంది ఓర్వలేకుండా ఉన్నారంటూ పటోలే అన్నారు.

congress will emerge number one party in maharashtra says nana patole ksp
Author
Mumbai, First Published Jul 13, 2021, 3:40 PM IST

మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెంబర్ వన్ పార్టీగా కాంగ్రెస్ నిలువబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వంలో అంతా సజావుగానే ఉందని కూడా ఆయన అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ మళ్లీ మొదటి స్థానంలోకి రావడం ప్రజలంతా చూస్తారని, రాష్ట్రంలో పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి అనేక మంది ఓర్వలేకుండా ఉన్నారంటూ పటోలే అన్నారు. బీజేపీతో పాటు ఎంవీఏ ప్రభుత్వంలోని భాగస్వాములపైనా పటోలే విమర్శలు గుప్పించారు.

మహా వికాస్ అఘాడి ప్రభుత్వం తన కదలికలపై దృష్టి పెట్టిందని నానా పటోలే ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతుండటంతో ఎంవీఏ భాగస్వాములైన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లు సైతం మహారాష్ట్రలో తమ పట్టు జారిపోతోందనే అభిప్రాయంతో ఉన్నాయంటూ మండిపడ్డారు. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సాగిస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు లభిస్తోందని పటోలే తెలిపారు.

Also Read:స్పీకర్ రాజీనామా... మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం

త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదని నానా పటోలే జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని కూకటివేళ్లతో ప్రజలు పెకిలించేస్తారు అని పటోలే అన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన నియామకం జరిగిన తర్వాత ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినట్టు పటోలె చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందినదని, కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని సోనియా తనను ఆదేశించారని ఆయన తెలిపారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో తాము భాగస్వాములైనప్పటికీ కొందరు తమకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios