Congress slams wheat export ban: ప్రపంచంలో గోధుమల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది.  అయితే, ప్ర‌స్తుతం దేశంలో నెలకొన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్ర‌భుత్వం గోధుమ‌ల ఎగుమ‌తిపై నిషేధం విధించింది.  

P Chidambaram: పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం గోధుమల‌ ఎగుమతులను తక్షణమే నిషేధిస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే, గోధుమల ఎగుమతిపై నిషేధం విధించడంపై కాంగ్రెస్.. కేంద్రంలోని భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడింది. ఇది అధిక ఎగుమతి ధరల ప్రయోజనాలను రైతులకు అందకుండా చేస్తున్నందున ఇది "రైతు వ్యతిరేక చర్య" అని పేర్కొంది.

ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ కొనసాగుతున్న 'చింతన్ శివిర్' రెండవ రోజు విలేకరుల సమావేశంలో ప్రభుత్వం గోధుమ‌ల ఎగుమ‌తిపై తీసుకున్న చ‌ర్య‌ల గురించి మీడియా ప్ర‌శ్నించ‌గా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరం మాట్లాడుతూ.. "కేంద్ర ప్రభుత్వం గోధుమ‌ల‌ను సేకరించడంలో విఫలమవడమే దీనికి కారణమని నేను భావిస్తున్నాను. గోధుమల ఉత్పత్తి తగ్గిపోయిందని కాదు, ఎక్కువ లేదా తక్కువ అదే. నిజానికి, ఇది స్వల్పంగా ఎక్కువగా ఉండవచ్చు" అని అన్నారు. ఇలా చేయ‌డంతో తానేమీ ఆశ్చ‌ర్య‌పోలేద‌ని, మోదీ ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌న్న విష‌యం త‌మ‌కు తెలుస‌ని చిదంబ‌రం ఎద్దేవా చేశారు.

"కొనుగోలు జరిగి ఉంటే, గోధుమ ఎగుమతిని నిషేధించాల్సిన అవసరం ఉండేది కాదు" అని చిదంబ‌రం చెప్పారు. అయితే గోధుమల ఎగుమతిని నిషేధించడం రైతు వ్యతిరేక చర్య అని ఆయ‌న ఆరోపించారు. ఇది అధిక ఎగుమతి ధరల ప్రయోజనాలను రైతు పొందకుండా చేస్తుంది. ఇది రైతు వ్యతిరేక చర్య.. దీని గురించి పెద్ద‌గా ఆశ్చర్యపోనవసరం లేదు.. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు.. రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం అని చిదంబ‌రం ఆరోపించారు. అంత‌కుముందు కూడా పి.చిదంబరం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత దేశ ఆర్థిక విధానాలను రీసెట్ చేయాల్సిన అవసరముందని ఆయ‌న కేంద్రానికి సూచించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల ‘చింతన్ శివిర్’లో ఆర్థిక అంశాలపై చర్చలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థపై ప్యానెల్‌కు చిదంబరం సారథ్యంవహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చిదంబరం ఉదయపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. 

కాగా, దేశ వ్యాప్తంగా గోధుమల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా గోధుమల ఎగుమతిపై భారత్ తక్షణమే నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ధరలను అదుపులో ఉంచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచంలో గోధుమల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఇప్పటికే జారీ చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద గోధుమలను ఎగుమతి చేసేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా గోధుమల డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి చివరలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుండి నల్ల సముద్రం ప్రాంతం నుండి గోధుమల ఎగుమతులు పడిపోయిన తరువాత గ్లోబల్ కొనుగోలుదారులు గోధుమ సరఫరా కోసం భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారు.