Asianet News TeluguAsianet News Telugu

UP Election 2022: హిందు ద్వేషికి కాంగ్రెస్ వెల్‌కమ్.. ఒకే వేదిక పంచుకుని.. : బీజేపీ విమర్శలు

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడింది. హిందువులను బెదిరిస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన తౌఖీర్ రజా ఖాన్‌తో కాంగ్రెస్ యూపీ చీఫ్ వేదిక పంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముస్లిం యువత చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. హిందువులు దాక్కోవడానికి ప్రదేశమే ఉండదని ఆయన వార్నింగ్ చేశారు. అలాంటి వ్యక్తిని కేవలం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేరదీసిందని మండిపడింది. ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ తానే పెద్ద హిందువని ప్రకటించుకుంటారని, తీరా ఆయన పార్టీ మాత్రం హిందువు వ్యతిరేకులకు నీడ ఇస్తున్నదని పేర్కొన్నారు.
 

congress shares stage with hate monger slams bjp
Author
Lucknow, First Published Jan 18, 2022, 12:17 PM IST

లక్నో: కాంగ్రెస్(Congress) సెక్యూలర్ పార్టీ(Secular Party) అని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. బీజేపీ(BJP)పై విమర్శలు చేస్తూ... తాము అన్ని మతాలను సమంగా చూస్తామని గొప్పలు పోతుంటారు. తాజాగా, కాంగ్రెస్(Congress) అనురిస్తున్నదనే సెక్యూలర్ వైఖరిపైనే బీజేపీ ఘాటు విమర్శలు చేసింది. హిందువుల(Hindus)పై ఇటీవలే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఇత్తిహాద్ ఇ మిల్లత్ కౌన్సిల్ పార్టీ చీఫ్, ముస్లిం క్లరిక్ మౌలానా తౌఖీర్ రజా ఖాన్.. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందు విద్వేషకులకు కాంగ్రెస్ నీడ ఇస్తున్నదని మండిపడింది.

బీజేపీ నేషనల్ స్పోక్స్‌పర్సన్ షెహజాద్ పూనావాల ట్విట్టర్‌లో ఈ ఆరోపణలు చేశారు. ఎన్నికలు రాగానే.. రాహుల్ గాంధీ తానే పెద్ద హిందువు అని ప్రకటిస్తారని పేర్కొన్నారు. హిందూ మారణ హోమాన్ని కోరిన వ్యక్తిని ఆయన పార్టీ ఆహ్వానిస్తుందంటూ చురకలు అంటించారు. తౌఖీర్ రజా ఖాన్‌తో కాంగ్రెస్ యూపీ ప్రెసిడెంట్‌ వేదిక పంచుకోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. ఇమ్రాన్ మసూద్‌ స్థానాన్ని భర్తీ చేయడానికి వారు తౌకీర్ రజా ఖాన్‌ను తెచ్చుకున్నారా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఈ మత విద్వేషకులను గౌరవిస్తుందని ఆరోపించారు. విభజన రాజకీయాలను చేస్తుందని మండిపడ్డారు. హిందువులను బెదిరించి, భయపెట్టించిన వ్యక్తులను చేర దీసి ముస్లిం ఓట్లను కైవసం చేసుకుంటుందని తెలిపారు.

హిందువులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే ఇమ్రాన్ మసూద్‌ను కాంగ్రెస్ ఇటీవలే కోల్పోయిందని, అందుకోసం మళ్లీ హిందు ద్వేషుల కోసం ట్యాలెంట్ హంట్ చేసిందని ఆరోపించారు. ఆ ట్యాలెంట్ హంట్‌లో కాంగ్రెస్‌కు తగిలిన ముత్యం.. ఈ తౌఖీర్ రజా ఖాన్ అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో క్యాంపెయిన్(Uttar Pradesh Assembly Election) చేయడానికి తౌఖీర్ రజా ఖాన్‌ను కాంగ్రెస్ సమీపించిందని వివరించారు.

ఈ రోజుతో కాంగ్రెస్ క్యారెక్టర్ బయట పడిందని విమర్శించారు. అల్లర్లు ప్రేరేపించడం, ఓటు బ్యాంకును రెచ్చగొట్టడం, హిందువులను దూషించడం, ఆ తర్వాతి వారి ఓట్లను పొందడం.. ఇదే కాంగ్రెస్ ఎజెండా అని మండిపడ్డారు. ఇదే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ అని ఆరోపించారు. ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నందుకే వారు తౌఖీర్ రజా మద్దతును తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. 

తౌఖీర్ రజా ఖాన్, ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ నేతలు వారితో వేదిక పంచుకున్నది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ ల్లలు, తౌఖీర్ రజా ఖాన్‌లు సంయుక్తంగా ఒకే వేదికపై విలేకరులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలను అభివృద్ధి చేయగలదని ఈ సందర్భంగా తైఖీర్ అన్నారు. యూపీలో బరేలీలోని తౌరీఖ్ రజా ఖాన్ హిందువులను హెచ్చరించారు. తాను తన మతంలోని యువత ఆగ్రహాన్ని చూశానని, వారి కళ్లు మండుతూ కనిపించాయని పేర్కొన్నారు. వారు గనక చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. హిందువులకు కనీసం దాచుకోవడానికి స్థలం కూడా దొరకదని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అప్పుడు కలకలం రేపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios