న్యూఢిల్లీ: రైతు వ్యవస్థను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. 

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ  శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని  లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం వెలుపల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆందోళనలు నిర్వహించారు. ఈ  సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు.ఇవాళ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది

also read:రైతులతో ముగ్గురు మంత్రుల భేటీ: తొమ్మిదోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు

 రైతులు నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోందన్నారు. రైతుల ఆందోళనలకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.కొత్త సాగు చట్టాలను ఆపకపోతే అన్ని రంగాలకు ఇదే పరిస్థితి వస్తోందని ఆయన చెప్పారు. రైతులంటే మోడీకి గౌరవం లేదన్నారు.

నరేంద్రమోడీ సర్కార్ ఇంతకు ముందు రైతుల భూమిని లాక్కొనేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. బీజేపీ సర్కార్ భూసేకరణ చట్టాన్ని తెచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలిపివేసిందన్నారు. ఇప్పుడు బీజేపీ వారి ఇద్దరు ముగ్గురు స్నేహితులు రైతులపై దాడి చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 40 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు.