ప్రణబ్‌పై రివేంజ్ ప్లాన్ చేశారా..?

ప్రణబ్‌పై రివేంజ్ ప్లాన్ చేశారా..?

తన జీవితంలో సుమారు ఆరు దశాబ్ధాల కాలాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసి.. మహామహుల మంత్రివర్గాల్లో పనిచేసి క్లిష్ల సమయాల్లో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చున్నారు ప్రణబ్ ముఖర్జీ. రక్షణ, ఆర్ధిక, విదేశీ వ్యవహారాలు సహా ఇతర కీలక పదవుల్లో పనిచేశారు. అంతటి కరడుగట్టిన కాంగ్రెస్ వాదికి చిరకాల వాంఛ ఒకటి ఉంది.. అదే ప్రధాని పదవి చేపట్టడం. ఎన్నోసార్లు తన మనసులోని మాటను ఆయన బహిరంగంగానే బయటపెట్టారు. కానీ అది కలగానే  మిగిలిపోయింది.

2004, 2009లలో తననే ప్రధాని చేస్తారని ఆయన భావించారు. కానీ సోనియా గాంధీ అనూహ్యంగా మన్మోహన్ సింగ్‌ను బలపరిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఈ కురువృద్ధుడిని రాష్ట్రపతిగా చేసి కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత తెలుపుకుంది. క్రియాశీలక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న  ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు ప్రధాని కాగలనని మరోసారి ఆశలు చిగురించాయి.

ఇది ఆయనంతట ఆయనకు కలిగిన ఆలోచన కాదు.. దేశవ్యాప్తంగా మోడీ ప్రభ మసకబారుతుండటం.. బీజేపీయేతర పక్షాలు ఏకతాటిపైకి వచ్చి తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రణబ్ దాదాను ప్రధానిగా చేయబోతున్నాయంటూ కొద్దిరోజులు మీడియాలో కథనాలు వచ్చాయి. వాటిని దాదా ఖండించకపోగా.. తనకు ప్రధాని పదవిపై ఉన్న ఆసక్తిని మరోసారి బయటపెట్టుకున్నారు. వీటన్నింటిని ఒక కంట కనిపెడుతూ వస్తోన్న కాంగ్రెస్ హైకమాండ్ కాస్తంత గుర్రుగానే ఉంది.. అగ్నికి ఆజ్యం పోసినట్లు కాంగ్రెస్ పార్టీ బద్ధ శత్రువుగా భావించే ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాలకు ప్రణబ్ వెళ్లడం హస్తానికి రుచించలేదు..

ఇన్నాళ్లు సేవ చేసిన కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రధాని అయ్యే అవకాశం దక్కదని... ఈ నేపథ్యంలో ఆ పదవి పొందేందుకు అవకాశం అంటూ ఉంటే అది బీజేపీ సహకారంతోనే సాధ్యమని ప్రణబ్‌కు తెలుసు.. మోడీ అయినా.. మరొకరైనా ఆర్ఎస్ఎస్ అశీస్సులు ఉంటేనే ప్రధాని పదవిలో కొనసాగగలరని రాజకీయాలపై కాస్తంత అవగాహన ఉన్న వారికైనా తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ స్ధానాలు లభించని పక్షంలో ఎన్డీఏ-3 ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్ పేరును మమతా బెనర్జీ ప్రతిపాదిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే మోడీని మరోసారి ప్రధానిగా ఒప్పుకోవడానికి దేశంలోని ప్రాంతీయ పార్టీల నాయకులు సిద్ధంగా లేరు. అందువల్ల ఆర్ఎస్ఎస్‌ను ప్రసన్నం చేసుకోవడానికి కొడుకు, కూతురు చెప్పినా వినకుండా ప్రణబ్ నాగ్‌పూర్ వెళ్లారని విశ్లేషకుల అంచనా. ఇది గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం దాదాపై ఆగ్రహంతో ఉందని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్‌కు ఆహ్వానం అందలేదు.. బీజేపీకి వ్యతిరేకంగా మూడో కూటమిని నిర్మించే ప్రయత్నంలో మాజీ రాష్ట్రపతికి ఆహ్వానం పంపకపోవడం  రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page