కర్ణాటకలో కాంగ్రెస్ వరాలు.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు.. యువనిధి పథకాన్ని ప్రకటించిన రాహుల్ గాంధీ
కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వస్తే డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు రూ.3 వేలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే డిప్లొమా చదివి, నిరుద్యోగులుగా ఉన్న యువతకు రూ.1500 అందిస్తామని చెప్పింది. ఈ పథకాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం బెళగావిలో ప్రకటించారు.
కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు భారీ వరాన్నే ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ యువక్రాంతి సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో యువత కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన నాలుగో వాగ్దానం అయిన ‘యువ నిధి’ పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “భారత్ జోడో యాత్ర సందర్భంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు యువతను వేధిస్తున్న సమస్య నిరుద్యోగం అని గుర్తించాను. నిరుద్యోగ సమస్యపై అవినీతి బీజేపీ ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిగా ఎలా ఉండిపోయిందో తెలుసుకునేందుకు వేలాది మంది యువకులతో మాట్లాడాను.’’ అని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు.
ఇంటి వద్దే సంపాదించండని, లైక్‌లు కొడితే డబ్బులు ఇస్తామని మోసం.. రూ. 2 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లు
‘‘ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే యువ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం. పథకం ద్వారా రూ. రెండేళ్లపాటు గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఉన్న నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.3000 అందిస్తాం. అలాగే రాష్ట్రంలో డిప్లొమా చదివిన, నిరుద్యోగులైన యువతకు నెలకు రూ.1500 భృతి ఇస్తాం’’ అని హామీ ఇచ్చారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ జిల్లాలోనైనా పర్యటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల వేవ్ కనిపిస్తోందని చెప్పారు. అవినీతిమయమైన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. కర్ణాటకలో మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, పోలింగ్ తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం: అరుణ్ రామచంద్రపిళ్లైకి ఏప్రిల్ 3 వరకు జ్యూడీషీయల్ కస్టడీ
కాగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) ప్రజలకు ప్రతి నెలా 10 కిలోల ఉచిత బియ్యం అందిస్తామని ఫిబ్రవరిలో హామీ ఇచ్చింది. దీనికి ‘అన్న భాగ్య’ అనే పేరును నిర్ణయించింది. అలాగే జనవరిలో మహిళల కోసం 'గృహ లక్ష్మి' పథకాన్ని ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతీ గృహిణికి నెలకు రూ.2వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.