Asianet News TeluguAsianet News Telugu

గోవాలో వేడెక్కుతున్న రాజకీయం

 గోవాలో రాజకీయ వేడి రగులుకుంటోంది. సీఎం పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యం పాలవ్వడంతో ఆయన ఎయిమ్స్ లో చికిత్సపొందుతున్నారు.

Congress offers to form stable govt in Goa
Author
Panaji, First Published Sep 17, 2018, 9:02 PM IST

పనాజీ: గోవాలో రాజకీయ వేడి రగులుకుంటోంది. సీఎం పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యం పాలవ్వడంతో ఆయన ఎయిమ్స్ లో చికిత్సపొందుతున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయని వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కాంగ్రెస్ ను ఆహ్వానించాలంటూ గవర్నర్ మృదుల సిన్హాకు ఆ పార్టీ నాయకులు లేఖ అందించారు. 

 బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ లేఖలో పేర్కొంది. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో 40 మంది ఎమ్మెల్యేలకు గానూ కాంగ్రెస్ కు 16 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 14 సభ్యుల చొప్పున సంఖ్యాబలం ఉంది. అయితే బీజేపీ మిత్ర పక్షాలైన ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీలకు చెందిన చెరో ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు, ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  

మరోవైపు పారికర్‌ అనారోగ్యం కారణంగా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు బీజేపీ ముగ్గురు సీనియర్‌ నేతల్ని గోవాకు పంపించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్‌ సంతోష్, రామ్‌ లాల్, రాష్ట్ర ఇన్‌చార్జి విజయ్‌ పురాణిక్‌లతో కూడిన ఈ బృందం రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు మిత్ర పక్షాలైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ, ఎంజీపీ పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులతో సమావేశమైంది. 
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో అసంతృప్తి జ్వాల చెలరేగిందని ఆ పార్టీలో కుమ్ములాటలు మెుదలయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. తమ సభ్యులంతా ఐక్యంగా ఉన్నామని గవర్నర్  కు తెలిపారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.   

Follow Us:
Download App:
  • android
  • ios