కాంగ్రెస్‌కు జీతిన్ ప్రసాద గుడ్‌బై చెప్పడంతో పార్టీలోని అసమ్మతి నేతలు మరోసారి అధిష్టానంపై గళం విప్పారు. తాజాగా వీరప్ప మొయిలీ స్పందించారు. కాంగ్రెస్‌కు భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని ఆయన సూచించారు. బాధ్యతలను అప్పగించేటపుడు సైద్ధాంతిక నిబద్ధతగల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని మొయిలీ కోరారు.

జితిన్ ప్రసాద మిగిలిన అన్నిటి కన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చారని మొయిలీ ఆరోపించారు. జితిన్ సైద్ధాంతిక నిబద్ధత మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. జితిన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక స్థానమైనా లభించలేదని, దీనిని బట్టి ఆయన అసమర్థుడని స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు.

Also Read:బీజేపీలో చేరడమంటే చచ్చిపోయినట్టే లెక్క: కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు

పార్టీలోని నేతల సమర్థతను సరైన రీతిలో అధిష్ఠానం మదింపు చేయాలని... అర్హత లేనివారిని నాయకులుగా తయారు చేయడం సాధ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జితిన్ వ్యవహారం పార్టీకి ఓ గుణపాఠంగా వీరప్ప మొయిలీ అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  చేస్తున్న పోటా పోటీ రాజకీయాలకు తగినట్లుగా మనల్ని మనం మలచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదనేదేమీ లేదని.. కాంగ్రెస్‌ను గాడిలో పెడితే ఆయన ఓడించవచ్చుని మొయిలీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడే కాంగ్రెస్‌కు మేజర్ సర్జరీ అవసరమని.. దీనిని రేపటికి వాయిదా వేయకూడదని సూచించారు.