Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలో చేరడమంటే చచ్చిపోయినట్టే లెక్క: కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు

వరుసపెట్టి నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్న నేపథ్యంలో సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందించారు. పార్టీలో సంస్కరణలు చేయాల్సిన తరుణం వచ్చిందని, తాము ఇచ్చే సూచనలను హైకమాండ్ ఇకనైనా వినాలని సిబాల్ విజ్ఞప్తి చేశారు

Over My Dead Body Congresss Kapil Sibal On Jitin Prasada quit ksp
Author
New Delhi, First Published Jun 10, 2021, 2:54 PM IST

వరుసపెట్టి నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్న నేపథ్యంలో సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందించారు. పార్టీలో సంస్కరణలు చేయాల్సిన తరుణం వచ్చిందని, తాము ఇచ్చే సూచనలను హైకమాండ్ ఇకనైనా వినాలని సిబాల్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోని సమస్యలను ఇంకా పరిష్కరించలేదని, అది నిజమేనని ఆయన అంగీకరించారు. వాటిని పరిష్కరించనంత వరకూ వాటి గురించి వేలెత్తి చూపుతూనే ఉంటామని సిబాల్ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం విఫలమైతే పార్టీ నేతలందరూ విఫలమైనట్టేనని ఆయన అభివర్ణించారు.

ఒకవేళ తాము అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని అన్నారు. అయితే, బీజేపీలో మాత్రం చేరేది లేదని, తాను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకమని తేల్చిచెప్పారు. బీజేపీలో చేరడమంటే తాను చచ్చిపోయినట్టే లెక్క అంటూ సిబాల్ ఉద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ నుంచి కీలకమైన నేత బీజేపీలోకి వెళ్లడంతో.. తాజాగా ‘జీ 23’ అసమ్మతి వర్గం చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. పార్టీలో సమూలమైన మార్పులు చేయాల్సిందేనని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గతంలో ఆ వర్గం నేతలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

Also Read:అమిత్ షాతో ఏ డీలూ చేసుకోలేదు, కాంగ్రెస్‌ను వీడిన కారణమిదే: జీతిన్ ప్రసాద

మరోవైపు బీజేపీలో జితిన్ ప్రసాద చేరికపై సిబాల్ ఘాటుగా స్పందించారు. అది 'ప్రసాద రామ' రాజకీయాలని.. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని ఆయన ఆరోపించారు. పార్టీ ఏం చేసింది? ఏం చేయలేదు? అన్నది తనకు అనవసరమని అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందని కపిల్ సిబాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడటంలో జితిన్ కు కారణాలుండి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జీతిన్ ప్రసాద పార్టీని వీడినందుకు విమర్శలు చేయాల్సిన అవసరం లేదని, కానీ, పార్టీని వీడేందుకు ఆయన చెప్పిన కారణాలనే విమర్శించాలని కపిల్ సిబాల్ సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios