అదానీ గ్రూప్ అక్రమాలపై మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. త్వరలో జరగనున్న జీ 20 సమావేశాల్లో దీని గురించి అడిగితే ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతారని ప్రశ్నించారు. 

అదానీ గ్రూప్ అక్రమాలపై మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఇండియా కూటమి సమావేశం సందర్భంగా ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిలియన్ డాలర్ల ధనం ఇండియా నుంచి వెళ్లి వివిధ మార్గాల్లో మళ్లీ తిరిగి వచ్చిందని కథనాలు వచ్చాయన్నారు. ఈ డబ్బు ఎవరిది.. ఆదానీదేనా, ఇంకెవరిదైనానా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీని వెనుక వినోద్ అదానీ వున్నట్లు కథనాలు వచ్చాయన్నారు. 

వీరితో పాటు నాసర్ అలీ, ఛాంగ్ చుంగ్ లింగ్ కూడా వున్నారని మీడియాలో కథనాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. గతంలో వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చీట్ ఇచ్చిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. అదానీకి క్లీన్ చీట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎన్డీటీవీలో డైరెక్టర్‌గా వున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టే అదానీ గ్రూప్‌లో ఏదో తప్పు జరుగుతోందని అర్ధమవుతోందన్నారు. మనది చాలా పారదర్శక ఆర్ధిక వ్యవస్థ అని ప్రపంచానికి చెబుతున్నామని.. ప్రధానికి సన్నిహితుడైన వ్యక్తి.. తన సంస్థ షేర్ల విలువ పెంచేందుకు బిలియన్ డాలర్లు విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టించారని రాహుల్ ఆరోపించారు. 

ఈ కుంభకోణంపై ఎందుకు విచారణ జరిపించరని ఆయన ప్రశ్నించారు. అదానీ గ్రూపు అంశంపై జేపీసీ విచారణకు ఎందుకు అనుమతించరని రాహుల్ గాంధీ నిలదీశారు. విచారణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు చొరవ తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కుంభకోణానికి పాల్పడిన వాళ్లను జైళ్లో ఎందుకు పెట్టరని రాహుల్ ప్రశ్నించారు. త్వరలో ఢిల్లీలో జీ20 సమావేశం జరగబోతోందని.. ఈ సమావేశంలో అదానీ గ్రూపుపై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. అదానీ గ్రూపు.. ఎందుకు అంత ప్రత్యేక సంస్థగా మారిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.