National Herald case: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తో సహా నిరసన నాయకులు జంతర్ మంతర్‌కు మార్చ్‌ను ప్రకటించారు.  అయితే అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకునీ, ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. 

Rahul Gandhi-National Herald case: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ స‌ర్కారుపై కాంగ్రెస్ శ్రేణులు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి. ప్ర‌భుత్వ తీరుకు ఖండిస్తూ.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఆందోళ‌న‌కు దిగాయి. నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేక‌పోవ‌డంతో పోలీసులు వారిని అడ్డుకోవ‌డంతో పాటు ప‌లువురు నేత‌ల‌కు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని కాంగ్రెస్ ఆరోపించింది. 

వివ‌రాల్లోకెళ్తే.. నేష‌న‌ల్ హెరాల్డ్-మ‌నీలాండ‌రింగ్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ‌రుస‌గా విచార‌ణ‌కు పిలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్.. బీజేపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం.. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్న‌ద‌ని ఆరోపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం, నేషనల్ హెరాల్డ్ మనీ లాండ‌రింగ్ కేసు పై విచారణ సంస్థ ఐదో రోజు ప్రశ్నిస్తున్న పార్టీ అధినేత రాహుల్ గాంధీని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం సత్యాగ్రహం దీక్ష‌ను చేపట్టింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తో సహా నిరసన నాయకులు జంతర్ మంతర్‌కు మార్చ్‌ను ప్రకటించారు. అయితే అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇచ్చారని, అయితే మార్చ్ చేయడానికి అనుమతించలేదని పోలీసులు తెలిపారు. బఘెల్, మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ కార్యాలయం వెలుపల రోడ్డుపై కూర్చున్నారు. ప్రజలను మోసం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారిగా ముసుగు వేసుకుంటున్న బీజేపీ నాయకుల‌ను ఫాసిస్టులుగా గెహ్లాట్ అభివర్ణించారు.

Scroll to load tweet…

“వారు (బీజేపీ నాయకులు) ఫాసిస్టులు.. ప్రజాస్వామ్య ముసుగు ధరించారు. వారు ఒక వర్గాన్ని మరొక వర్గానికి వ్యతిరేకంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.. సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ”అని ఆయన అన్నారు. ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తమ సత్యాగ్రహాన్ని కొనసాగించాలని పార్టీ కార్యకర్తల‌కు పిలుపునిచ్చారు. పోలీసులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆగ్రహించిన నిరసనకారులు వాటిని తొల‌గించి ముందుకు సాగారు. కాంగ్రెస్ కార్యకర్తలు అగ్నిప‌థ్ స్కీమ్ కు వ్య‌తిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యాల నుండి దృష్టిని మరల్చడానికి తీసుకువ‌చ్చార‌నీ, ఈ స్కీమ్ దేశ యువతను అంధకారంలోకి నెట్టివేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలను పోలీసులు వేధిస్తున్నారని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.