సెమీ ఫైనల్ నుంచి వెనుదిరిగిన టీమిండియా జట్టు పై కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఓడిపోతుందని కాదు.. కానీ, ఇంత పేలవ ప్రదర్శన ఇస్తున్నదనే బాధ కలిగిస్తున్నదని వివరించారు.
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా వైదొలిగింది. సెమీస్‌లో ఇంగ్లాండ్ పై పరాజయం పాలైంది. దీంతో ఫైనల్‌కు వెళ్లకుండానే రోహిత్ సేన వెనుదిరిగింది. ఈ పరిణామంపై మన దేశంలోని క్రికెట్ అభిమానులు ఉసూరుమంటున్నారు. చాలా మంది తమ నిరాశను సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా కామెంట్ చేశారు.
క్రికెట్ పై మక్కువ ఎక్కువ ఉండే శశిథరూర్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ట్వీట్ చేస్తుంటారు. ఈ సారి టీమిండియా ఓటమికి మరో రెండు బంతులు ఉండగానే ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. భారత్ ఓడిపోతున్న విషయాన్ని తాను పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. క్రీడ అన్నప్పుడు గెలుపోటములు సహజం అని వివరించారు. టీమిండియా మరీ పేలవ ప్రదర్శన చేయడమే బాధిస్తున్నదని తెలిపారు.
Also Read: 1992లో ఏం జరిగింది..? 2022లో కూడా అదే జరిగితే..!
బ్యాటింగ్ ఎంచుకుని క్రీజులోకి దిగిన టీమిండియా ఇంగ్లాండ్ జట్టు ముందుు 169 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను ఇంగ్లాండ్ సునాయసంగా ఛేజించింది. 16 ఓవర్‌లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా టార్గెట్ చేజ్ చేసి గెలించింది. ఈ రోజు అడిలైడ్ ఓవల్‌లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ నడుమ జరిగింది. భారత్‌పై గెలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరింది. కాగా, న్యూజిలాండ్ పై విజయాన్ని నమోదు చేసుకున్న పాకిస్తాన్ ఫైనల్‌కు వెళ్లింది. పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఫైనల్‌లో తలపడనున్నాయి.
ఒకానొక దశలో పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి వెళ్లిపోయే స్థితికి వెళ్లింది. కానీ, అదే టీమ్ ఫైనల్‌కు చేరుకుని, వరల్డ్ కప్ కోసం ప్రయత్నిస్తున్నది.
ఇంగ్లాండ్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్‌లు సునాయసంగా భారత్ పెట్టిన లక్ష్యాన్ని సాధించి వారి జట్టుకు విజయాన్ని అందించారు. హేల్స్ సాధించిన 86 పరుగుల్లో ఏడు సిక్స్‌లు ఉన్నాయి. జోస్ బట్లర్ మూడు సిక్స్‌లు కొట్టాడు.
