1992లో ఏం జరిగింది..? 2022లో కూడా అదే జరిగితే..!
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ మ్యాచ్ జరుగబోతోంది. అసలు సెమీస్ ఆశలే లేని పాకిస్తాన్.. పడుతూ లేస్తూ సెమీఫైనల్స్ కు వచ్చిన ఇంగ్లాండ్ కలిసి ఈనెల 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్ ఆడనున్నాయి.
క్రికెట్‌లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని అంటారు ఆటను గురించి విశ్లేషించే పెద్దలు. గతంలో ఇది పలుమార్లు నిరూపితమైనా తాజాగా టీ20 ప్రపంచకప్ లో కూడా పైన స్టేట్మెంట్ నిజమనిపించక మానదు. లేకుంటే అసలు టీ20 ప్రపంచకప్ లో సెమీస్ ఆశలే లేని పాకిస్తాన్ సెమీస్ చేరడమేంటి..? టోర్నీలో అప్పటిదాకా దుమ్ముదులిపిన కివీస్ సెమీఫైనల్లో దారుణంగా ఓడటమేంటి..? సెమీస్ వరకూ పడుతూ లేస్తూ వచ్చిన ఇంగ్లాండ్ ఫైనల్ చేరడమేంటి..? ఇవన్నీ ఊహకు అందని ప్రశ్నలే. ఏదేమైనప్పటికీ చివరికి ఫైనల్ మాత్రం పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య సాగనుంది. ఈనెల 13న ఇరు జట్లు మెల్‌బోర్న్ లో పోటీ పడతాయి.
ఈ రెండు జట్లూ ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ లో తలపడటం ఇది రెండోసారి. 1992 వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లాండ్-పాకిస్తాన్ ఫైనల్లో తలపడ్డాయి. ఇప్పుడు మళ్లీ 30 ఏండ్ల తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్స్ ఆడబోతున్నాయి. వేదిక కూడా అదే మెల్‌బోర్న్ (ఆసీస్). ఈ నేపథ్యంలో అసలు 1992లో ఏం జరిగిందో చూద్దాం.
అప్పుడూ ఇదే కథ..
టీ20 ప్రపంచకప్ - 2022లో పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడింది. తర్వాత జింబాబ్వే పైనా ఇదే ఫలితం. కానీ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి.. సౌతాఫ్రికా పై నెదర్లాండ్స్ నెగ్గడంతో అదృష్టం కలిసొచ్చి సెమీస్ కు చేరింది. అచ్చం 1992లోనూ ఇదే జరిగింది. మెల్‌బోర్న్ లోనే జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్ లో ఓడింది. గ్రూప్ స్టేజ్ లో ఇండియా చేతిలో పరాజయం. తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి ఒక ఎక్స్ట్రా పాయింట్ తో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు సెమీస్ చేరింది. సెమీస్ లో న్యూజిలాండ్ ను ఓడించింది. (2022లో కూడా ఇదే జరిగింది) ఫైనల్ లో మెల్‌బోర్న్ లో ఇంగ్లాండ్ తో తలపడింది.
ఫైనల్ లో..
ఫైనల్ లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (72), జావేద్ మియాందాద్ (58), ఇంజమామ్ ఉల్ హక్ (42) రాణించారు. చివర్లో వసీం అక్రమ్.. 18 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్.. ఇయాన్ బోథమ్ (0), అలెక్స్ స్టీవార్ట్ (7) వికెట్లను త్వరగానే కోల్పోయింది. కెప్టెన్ గ్రాహం గూచ్ (29) ఫర్వాలేదనిపించాడు. నీల్ ఫేయిర్ బ్రదర్ (62), అలియన్ లంబ్ (31) పోరాడారు. కానీ ముస్తాక్ అహ్మద్, వసీం అక్రమ్ లు తలా మూడు వికెట్లు తీయగా అకీబ్ జావేద్ రెండు, ఇమ్రాన్ ఖాన్ ఒక వికెట్ తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. ఫలితంగా ఇంగ్లాండ్.. 49.2 ఓవర్లలో 227 పరుగులకే పరిమితమైంది. పాకిస్తాన్.. 22 పరుగుల తేడాతో గెలుపొంది తమ తొలి వన్డే ప్రపంచకప్ ను ముద్దాడింది.
మరి ఇప్పుడూ అదే జరుగుతుందా..?
శకునాలన్నీ పాకిస్తాన్ కే అనుకూలంగా ఉన్నాయి. 1999 సెంటిమెంట్ రిపీట్ అవుతుందని పాకిస్తాన్ ఫ్యాన్స్ సంబురాలు కూడా మొదలుపెట్టారు. అయితే జరుగుతున్నది టీ20. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. అదీ ఇంగ్లాండ్ వంటి పటిష్ట జట్టు. తమదైన రోజున మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించే ఆటగాళ్లు ఆ జట్టు నిండా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టుగా.. సెంటిమెంట్ ను నమ్ముకుంటే పనికాదని.. మ్యాచ్ లో వందశాతం మెరుగైన ప్రదర్శన చేసినవారినే విజయం వరిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నవంబర్ 13న మెల్‌బోర్న్ లో చరిత్ర పునరావృతమవుతుందా..? లేక కొత్త చరిత్రకు నాంది పడుతుందా..? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే..