ఎంపీగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో తనకు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రభుత్వ గృహంలో వుండటానికి వీల్లేదని గత నెల 27న రాహుల్‌కు పంపిన నోటీసుల్లో లోక్‌సభ ప్యానెల్ తెలిపింది

ఎంపీగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో తనకు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. ఏప్రిల్ 22లోగా బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ డెడ్ లైన్ విధించగా.. గడువుకు ముందే రాహుల్ తన బంగ్లాను ఖాళీ చేశారు. శుక్రవారం 12 తుగ్లక్ లైన్‌లోని ప్రభుత్వ బంగ్లాలో వున్న తన వస్తువులు, సామాగ్రిని రాహుల్ ట్రక్కుల్లో తరలించారు. ఇకపోతే.. ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రభుత్వ గృహంలో వుండటానికి వీల్లేదని గత నెల 27న రాహుల్‌కు పంపిన నోటీసుల్లో లోక్‌సభ ప్యానెల్ తెలిపింది. 

కాగా..సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. పార్లమెంటు నుంచి ఆయనను డిస్‌క్వాలిఫై చేశారు. 2019 క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, అనర్హత వేటు మాత్రం తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్ పేర్కొనడం గమనార్హం.

Also Read: రాహుల్ గాంధీకి మరో షాక్.. ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసు, ఏప్రిల్ 22 వరకు డెడ్‌లైన్

దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అందులో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడినట్టు వివరణ ఉన్నది. కేరళలోని పార్లమెంటు వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిందని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ అనర్హత మార్చి 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు వివరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం, ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఇదిలావుండగా.. 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ కోర్టును ఆశ్రయించారు. ఆర్థిక నేరస్తులను పేర్కొంటూ వీరిందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉంటున్నది? అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. దీంతో మోడీ ఇంటి పేరున్న పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.