New Delhi: 2004 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో విజయం సాధించిన తర్వాత తనకు కేటాయించిన బంగ్లాను ఏంపీగా అన‌ర్హ‌త వేటుతో ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు అందుకున్న కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ.. ఢిల్లీలోని లుటియన్స్‌లో ఉన్న తన అధికారిక బంగ్లాను శనివారం ఖాళీ చేశారు. ఆ త‌ర్వాత తాను ఉన్న ఈ ప్రభుత్వ నివాసం తాళం చెవిని అధికారుల‌కు అందజేశారు. ఏప్రిల్ 22లోగా 12 తుగ్లక్ లేన్ లోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ ఇదివ‌ర‌కు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. 

Rahul Gandhi vacated government bunglow: నిజం మాట్లాడేందుకు ఎంతవరకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘మోడీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న త‌న‌కు కేటాయించిన‌ అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు పడిన తర్వాత ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత.. నిజాలు మాట్లాడినందుకు తాను ఈ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ తుగ్లక్‌ లేన్‌లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి తాళాలను సిబ్బందికి అందజేశారు. ఈ స‌మ‌యంలో అక్క‌డ సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.

ప్రభుత్వ బంగ్లా వెలుపల మీడియాతో మాట్లాడుతూ..

"భారత ప్రజలు నాకు 19 ఏళ్లుగా ఈ ఇంటిని ఇచ్చారు, నేను వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నిజం చెప్పినందుకు ఈ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. నిజం మాట్లాడేందుకు ఎంత మూల్యం చెల్లించుకోవడానికైనా సిద్ధమే" అంటూ వ్యాఖ్యానించారు. ఆ త‌ర్వాత కారులో కూర్చొని అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. తన వస్తువులను 10 జన్ పథ్ లోని తన తల్లి సోనియాగాంధీ నివాసంలో ఉంచుతానని చెప్పారు. మరో వసతి లభించే వరకు తాత్కాలికంగా అక్కడే ఉంటాన‌ని పేర్కొన్నారు.

కాగా, రాహుల్ గాంధీ 2005 నుంచి ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ లోని ప్రభుత్వ బంగ్లాలో నివసిస్తున్నారు. 2019లో మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు గాను సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ మరుసటి రోజే పార్లమెంటు సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేయడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దయింది. అయితే ఈ కేసులో ఈ తీర్పుపై రాహుల్ గాంధీ కూడా అప్పీల్ చేశారు. అయితే ఏప్రిల్ 22లోగా ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని మార్చి 27న లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22న నోటీసులు అందుకున్న రాహుల్ గాంధీ అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు.

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అధికార బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించింది. బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. కోర్టు తీర్పు, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యగా, ప్రజాస్వామ్యంపై దాడిగా కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు ఖండించాయి. అయితే, కోర్టు తీర్పును బీజేపీ సమర్థించుకుంది. రాహుల్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.