భారతదేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని విడిచిపెట్టడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీకి కరోనా పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నట్లుగా అభిషేక్ సన్నిహితులు తెలిపారు. సింఘ్వీకి జ్వరం లాంటి తేలిక లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఆయన భార్యకు కూడా పాజిటివ్‌గా తేలిందని, ప్రభుత్వ సూచనలను మేరకు ఆమె సైతం హోం క్వారంటైన్‌లోనే ఉన్నట్లుగా వెల్లడించారు.

Also Read:నాలుగు రోజుల్లో రిటైర్మెంట్: కరోనాతో చెస్ట్ ఆసుపత్రి హెడ్ నర్సు మృతి

భార్యాభర్తలకు వైరస్ నిర్థారణ కావడంతో వారి కుమారుడు, ఇతర కుటుంబసభ్యులతో పాటు సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,296 కరోనా కేసులు నమోదయ్యాయి.

అంతేకాదు 407 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 4,90,401కి చేరుకొన్నాయి. వీటిలో 1,89,463 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకినవారిలో 2,85,637 మంది కోలుకొన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:మూతపడుతున్న దుకాణాలు: జనరల్ బజార్, బేగం బజార్, రాణిగంజ్ మూత

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో 1.47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు సుమారు 7 వేల మంది మరణించారు. ఇక ఢిల్లీ రాష్ట్రంలో 73 వేల మందికి కరోనా సోకింది. సుమారు 2400 మంది మరణించారు.