కర్ణాటక ఎమ్మెల్సీ బైపోల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జగదీశ్ షెట్టర్‌కు ఈ జాబితాలో స్థానం కల్పించింది. 

బెంగళూరు: కర్ణాటక శాసన మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నది. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో జగదీశ్ షెట్టర్ పేరు ఉన్నది. ఆయనతోపాటు తిప్పన్నప్ప కమకనూర్, ఎన్ఎస్ బోసెరాజులూ ఉన్నారు. కర్ణాటకలో జూన్ 30వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమీపించిన తరుణంలో బీజేపీలో చాలా మంది తిరుగుబాటు చేశారు. టికెట్ల కోసం అల్టిమేట్లు జారీ చేశారు. ఇందులో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ కూడా ఉన్నారు. ఆయన ఏకంగా పార్టీ వీడుతాననీ ప్రకటించారు. అయినా.. ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లోకి మారారు. కాంగ్రెస్ టికెట్ పై అదే హుబ్బలి ధార్వాడ్ సెంట్రల్ సీట్ నుంచి పోటీ చేశాడు. కానీ, ఓటమి పాలయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం కావాలని బీజేపీ ఎమ్మెల్సీలు లక్ష్మణ్ సవాడి, బాబురావు చియాంచన్సుర్, ఆర్ శంకర్‌లు డిమాండ్ చేశారు. కానీ, టికెట్ ఇవ్వకపోవడంతో ఈ ముగ్గురూ ఆ తర్వాత శాసన మండలి సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు.

కాంగ్రెస్ కూడా లింగాయత్ లీడర్ జగదీశ్ షెట్టర్‌కు ప్రభుత్వంలో చోటు ఇవ్వాలని భావించింది. కానీ, ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో శాసన మండలి ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో లింగాయత్ లీడర్‌ను ఎలా సర్దుబాటు చేయాలా? అని కాంగ్రెస్ ఆలోచించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది.

Also Read: మరికొన్ని నిమిషాల్లో మతాంతర వివాహం.. పోలీసులు వచ్చి వధువును లాక్కెళ్లిపోయారు! కేరళలో పెళ్లివేడుక వద్ద హైడ్రామా

ఆయన గెలుపు దాదాపు ఖరారైనట్టే. ఎందుకంటే.. ఈ ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు ఓటేసి గెలిపించుకుంటారు. రాష్ట్రంలో 135 సీట్లతో కాంగ్రెస్ పైచేయి సాధించి ఉన్నది. కాబట్టి, జగదీశ్ షెట్టర్ విజయం దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు.

జూన్ 30న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు.