కాంగ్రెస్ తెచ్చిన ప్రతి స్కీంలో స్కాం ఉన్నది.. వాళ్లు ఆవు పేడనూ వదల్లేదు: ప్రధాని మోడీ
ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపథకంలో అవినీతి ఉన్నదని ప్రధాని మోడీ ఆరోపించారు. ప్రతి స్కీంలో ఒక స్కాం ఉన్నదని, కాంగ్రెస్ చివరికి ఆవు పేడనూ వదల్లేదని ఆరోపణలు గుప్పించారు. ఛత్తీస్‌గడ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ భుపేంద్ర సింగ్ భగేల్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

రాయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛత్తీస్‌గడ్ పర్యటనలో ఉన్నారు. బిలాస్‌పూర్‌లో నిర్వహించిన పరివర్తన్ మహా సంకల్ప్ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన ప్రతి పథకంలో అవినీతి ఉన్నదని దుయ్యబట్టారు. చివరకు ఆవు పేడనూ వదల్లేదని అన్నారు.
ఛత్తీస్‌గడ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ నిధుల కోసం కొరత రాకుండా చూసుకుందని ప్రధాని మోడీ అన్నారు. సరిపడా నిధులను రాష్ట్రానికి అందించామని వివరించారు. రోడ్లు, రైళ్లు, విద్యుత్ సహా అనేక ఇతర మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కల్పించిందని తెలిపారు. ఛత్తీస్‌గడ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కొరత రానివ్వలేదని చెప్పారు. కానీ, కేంద్రం నుంచి తాము ఛత్తీస్ గఢ్ అభివృద్ధికి ఎంత ప్రయత్నించినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విఫలం చేస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ తెచ్చిన ప్రతి స్కీంలో స్కాం ఉన్నదని ఆరోపణలు చేశారు. కొవిడ్ సమయంలో తాము గరీబ్ కళ్యాణ్ పథకం తెచ్చి రేషన్ షాపులో బియ్యం అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనూ స్కాం చేసిందని వివరించారు. లిక్కర్ కుంభకోణం చేసిందని అన్నారు. ఆవు పేడ స్కీంలోనూ స్కాం చేసిందని ఆరోపించారు.
Also Read: ఇండియా వచ్చినప్పుడు జస్టిన్ ట్రూడో డ్రగ్స్ మత్తులో ఉన్నాడా? కెనడా పీఎంవో కామెంట్ ఇదే
ఛత్తీస్‌గడ్‌లో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యం అని ప్రధాని మోడీ వివరించారు. ఇక్కడికి వచ్చిన ప్రజల ఉత్సాహాన్ని చూస్తే మార్పు తథ్యం అని తెలుస్తున్నదని తెలిపారు. ఛత్తీస్‌గడ్ కోసం కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నదో.. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు వాస్తవమని ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టీఎస్ డియో వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని వివరించారు. ప్రజా జీవితంలో దాచడానికి ఏమీ ఉండదని, ఛత్తీస్ గడ్ ఉపముఖ్యమంత్రి చెప్పినట్టుగా కేంద్రం ఈ రాష్ట్రానికి ఎక్కడా అన్యాయం చేయలేదని చెప్పారు.
త్వరలోనే మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లతోపాటు ఛత్తీస్‌గడ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.