కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశంపై పోరాటానికి ముఖ్య నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ పార్టీ నేత జైరాం రమేష్.  కక్షపూరితంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని.. మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. 

రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం దీనికి సంబంధించిన వివరాలను మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు. రాహుల్ అనర్హత వేటు అంశంపై పోరాటానికి ముఖ్య నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. మూడు అంచెలుగా పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. న్యాయ పోరాటం, దేశవ్యాప్తంగా వీధి పోరాటం, విపక్షాలను కలుపుకొని పోరాటం చేయాలని నిర్ణయించినట్లు జైరాం రమేష్ పేర్కొన్నారు. రాహుల్ అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కక్షపూరితంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని జైరాం రమేష్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso REad: రాహుల్ గాంధీ ముందున్న దారులేమిటీ? 8 ఏళ్లు ఎన్నికలకు దూరమేనా? కోర్టులో పిటిషన్ వేస్తారా?

కాగా..సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. పార్లమెంటు నుంచి ఆయనను డిస్‌క్వాలిఫై చేశారు. 2019 క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, అనర్హత వేటు మాత్రం తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్ పేర్కొనడం గమనార్హం. 

ఈ రోజు లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అందులో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడినట్టు వివరణ ఉన్నది. కేరళలోని పార్లమెంటు వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిందని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ అనర్హత మార్చి 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు వివరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం, ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఇదిలావుండగా.. 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ కోర్టును ఆశ్రయించారు. ఆర్థిక నేరస్తులను పేర్కొంటూ వీరిందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉంటున్నది? అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. దీంతో మోడీ ఇంటి పేరున్న పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. 30 రోజుల పాటు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ రాహుల్ గాంధీకి అవకాశం కల్పించింది.