Congress Crisis: కాంగ్రెస్‌లో నాయకత్వ మార్చే ప్రసక్తే లేదనీ, నాయకత్వంతో సమస్య లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగడం అందరికీ సమ్మతమేనన్నారు.
Congress Crisis: కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నసంక్షోభం కొంత కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది.ఐదు రాష్ట్రాలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన అనంతరం పార్టీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ రెబల్ నేతలు. ఈ క్రమంలో పార్టీలోని అసమ్మతి నేతలు ( జీ 23) వరుస భేటీలు నిర్వహించి.. పార్టీ నాయకత్వం మార్చాలని కొందరంటే.. మార్పుకు సమయం వచ్చిందని మరికొందరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద.. పార్టీలో అసమ్మతి రాగాలను లేవనెత్తారు. ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రంగంలోకి దిగాడు. కాంగ్రెస్ సీనియర్ రెబల్స్ నేతలతో వరుస భేటీలు నిర్వహించి, అసమ్మతి రాగాన్ని చల్లబరిచినట్టు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం కీలక పరిణామం జరిగింది. గులాం నబీ ఆజాద్.. అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చినట్టు తెలుస్తోంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం బాగా జరిగిందని, పార్టీని బలోపేతం చేయడంపై పలు సూచనలు ఇచ్చానని ఆజాద్ విలేకరులకు చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై అభిప్రాయాల్ని పంచుకునేందుకే ఆమెతో భేటీ అయినట్లు ఆయన తెలిపారు.
రాబోయే సాధారణ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని, ప్రతిపక్షాలను ఓడించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలంతా సోనియా గాంధీ నేతృత్వంలో ముందుకు సాగేందుకు సుముఖంగా ఉన్నారని, కొన్ని సలహాలు మాత్రం ఆమెతో పంచుకున్నామని ఆజాద్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఆమె అధ్యక్షురాలిగా కొనసాగాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు, మేము కొన్ని సూచనలను పంచుకున్నాము," అని ఆజాద్ అన్నారు, పార్టీలోని భ్రమలు గురించి మాట్లాడారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ రెబల్స్ జీ-23 తో బుధ, గురువారాల్లో ఆజాద్ నివాసంలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలంతా కలుపుకుని పోవాలని, పార్టీలోని లోపాలను హైకమాండ్‌కు సీనియర్లు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో గాంధేయులు తప్పుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి.
2020లో ఎన్నికల పరాజయాల తర్వాత సోనియా గాంధీకి మొదటిసారి అసమ్మతి నేతలు G-23 లేఖ అస్త్రాన్ని సంధించారు. తొలి నుంచే.. పార్టీ నాయకత్వం మారాలని భావిస్తున్నారు. బుధవారం జరిగిన జి-23 సమావేశానికి హాజరైన హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాను గురువారం రాహుల్ గాంధీ కలిశారు. ఈ సమావేశంలోపార్టీలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారనే దానిపై హుడా స్పష్టత కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన హుడా, పార్టీ నిర్ణయాల గురించి నేతలు తరచూ వార్తాపత్రికల ద్వారా తెలుసుకుంటారని రాహుల్ గాంధీకి చెప్పారు.
