93 శాతం రూట్లలో ఉడాన్ పథకం పని చేయలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. విమానయాన సంస్థల స్వతంత్ర ఆడిట్ కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. సామాన్యులకు ప్రభుత్వం నుంచి అబద్ధాలు, జుమ్లాలు మాత్రమే వచ్చాయని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకం 93 శాతం రూట్లలో పనిచేయలేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ విషయం తాను చెప్పడం లేదని, కాగ్ తన నివేదికలో దీనిని తేటతెల్లం చేసిందని అన్నారు. సామాన్యులకు ప్రభుత్వం నుంచి అబద్ధాలు, జుమ్లాలు మాత్రమే వచ్చాయని ఆయన ఆరోపించారు. 

చెప్పులు ధరించిన వారు కూడా విమానంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్న ప్రధాని మోడీ ప్రభుత్వ హామీని ఇంకా నెరవేర్చలేదని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘‘మేము ఈ మాట అనడం లేదు. కాగ్ రిపోర్టే ఇలా చెబుతోంది! 93 శాతం రూట్లలో ఈ పథకం (ఉడాన్) పనిచేయలేదు. విమానయాన సంస్థల స్వతంత్ర ఆడిట్ కూడా చేయలేదు. ఎంతో ప్రచారం పొందిన హెలికాప్టర్ సేవలు కూడా నిలిచిపోయాయి’’ అని ఖర్గే ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

‘‘ఉడాన్ రాలేదు, కేవలం అబద్ధాలు, జుమ్లాల గురించే మాట్లాడారు! అలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని భారత్ ఇప్పుడు క్షమించదు’’ అని ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కుంభకోణాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపిందని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని కాంగ్రెస్ బుధవారం ఆరోపించింది. కుంభకోణాలపై విచారణ జరిపి జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే డిమాండ్ చేశారు. అక్రమాలపై ప్రధాని ఎప్పుడు మౌనం వీడుతారని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీని ప్రోత్సహించడానికి, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు విమాన ప్రయాణాన్ని చౌకగా అందించడానికి 2016 అక్టోబర్ 21న ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పేరుతో ప్రాంతీయ కనెక్టివిటీ పథకాన్ని ప్రారంభించింది. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించింది.